బీజేపీ ఫ్రస్టేషన్ లో ఉంది…..దుబ్బాకలో గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాం….హరీష్ రావు

MInister Harish Rao Speccial Interview on Dubbaka by-elections : బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేటలో బీజేపీ నోట్ల కట్టలతో అడ్డంగా దొరికినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు.
మద్యం నోట్ల కట్టలతో ఓట్లను కొనాలనుకుంటున్నారని హరీష్ రావు బీజేపీ నేతలపై మండి పడ్డారు. 10టీవీ కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు దుబ్బాక లో డిపాజిట్లు కూడా దక్కే పరిస్ధితి లేదని వ్యాఖ్యానించారు. దుబ్బాక ఎన్నికల్లో ద్వితీయ స్దానానికి బీజేపీ కాంగ్రెస్ లు పోటీ పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో రామలింగారెడ్డి 62 వేల మెజార్టీతో గెలిచారని ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలికిచ్చిన హామీ మేరకు వెయ్యిరూపాయల ఫించన్ ను 2 వేల 116 రూపాయలకు పెంచామని, అదే విధంగా 4 వేల రూపాయలు ఉన్న రైతు బంధును 5వేల రూపాయలకు పెంచామని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారం లోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో కాళేశ్వరం జలాలను దుబ్బాక వ్యవసాయ క్షేత్రాల్లో పారించామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో సాధ్యం కాదనుకున్న కాళేశ్వరం జలాలను సీఎం కేసీఆర్ దుబ్బాకకు తీసుకువచ్చారని.. దాంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాళేశ్వరం జలాలుఎక్కువ అందే నియోజక వర్గం దుబ్బాక నియోజక వర్గం అని హరీష్ రావు వివరించారు.
నియోజక వర్గంలో లక్షా35 వేల ఎకరాలకుసాగునీరు అందుతోందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ రైతులకోసం శ్రమిస్తుందని.. సాగునీరు అందించటంతో పాటు… 24గంటల నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా అందించటం, రైతు బంధు, రైతు భీమా పధకం అమలు వంటి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని వివరించారు.
దుబ్బాక రైతు ఆధారిత వ్యవసాయ నియోజరక వర్గమని ఇక్కడ 78 వేల మంది రైతులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి ట్రాన్సఫార్మర్లు ఏర్పాటుచేసినా నాణ్యమైన కరెంట్ ఇవ్వలేక పోయారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కాలిపోయిన మోటర్లు రైతులకు గుర్తుకు వస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
బీజేపీ తెచ్చిన కొత్త ఎలక్ట్రిసిటీ చట్టాని ఏ రైతు ఒప్పుకునే పరిస్ధితి లేదని ఆయన తెలిపారు . బీజేపీ తెచ్చిన కొత్త చట్టం రైతు మెడకు ఉరితాడు తగిలించటమే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీఆర్ ఎస్ పార్టీ చేసిన మేలు రైతులు మరిచిపోరని ఆ రకంగా దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కడతారని మరోసారి ఉద్ఘాటించారు.
కాంగ్రెస్, బీజేపీలు పైసాలు, సీసాలు నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని తీవ్రంగావిమర్శించారు.టీఆర్ఎస్ పార్టీ అభివృధ్ది సంక్షేమాలనుదృష్టిలో పెట్టుకుని ఓటు వేయమని ప్రజలను కోరుతోందని ఆయన తెలిపారు. దుబ్బాకలో ఇంటింటికి తాగునీరిచ్చామని రాబోయే రోజుల్లో ప్రతి ఎకరానికి సాగునీరుఅందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.