అసలు ప్రిన్సెస్ ఎవరు? గజపతుల వారసత్వ పోరులో పూసపాటి యువరాణులు

విజయనగరం సంస్థానానికి చెందిన మాన్సాస్ ట్రస్టుకు, సింహాచలం దేవస్థానం బోర్డుకు చైర్‌పర్సన్‌గా సంచైత గజపతి నియామకం తర్వాత ఆ సంస్థాన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ సంస్థాన వారసులు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో కుటుంబపరమైన వివాదం కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థాన చరిత్ర రాజకీయ వివాదాల్లో చిక్కుకొని రోడ్డున పడింది. మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థాన బోర్డు మాజీ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీలో తిరుగులేని నాయకుడు. ఎన్నో పదవులను చేపట్టి, అటు రాజకీయాల్లోనూ, ఇటు విజయనగరం సంస్థానంలోనూ రాజాధిరాజుగా వెలిగారు. కానీ, రాత్రికి రాత్రి వచ్చిన ఒక్క జీవోతో అశోక్ తలరాతే కాదు.. సంస్థాన చరిత్ర గతే మారిపోయింది.
మరో కుటుంబాన్ని సంస్థానం ఆస్తుల వివాదంలోకి లాగిన సంచైత:
సంచైత గజపతికి మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం బాధ్యతలను అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊహించని షాకిచ్చింది. ముఖ్యంగా పూసపాటి కుటుంబీకులకు కోలుకోలేని దెబ్బ. సంచైతను ట్రస్టు ఛైర్మన్‌గా నియమించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించినా… అంత త్వరగా ఈ వివాదం ఒక కొలిక్కి వస్తుందనే నమ్మకం లేదంటున్నారు. ఓ వైపు అశోక్ కుటుంబానికి కోలుకోలేని షాక్ ఇచ్చిన సంచైత గజపతి… ఊహించని విధంగా మరో కుటుంబాన్ని సంస్థానం ఆస్తుల వివాదంలోకి లాగారు. దివంగత ఆనంద్ గజపతిరాజు భార్య సుధా గజపతి, కుమార్తె ఊర్మిళ గజపతిలపై ఆస్తులకు సంబంధించి కేసు పెట్టడంతో ఈ వ్యవహారం కాస్త… త్రిముఖ పోరుగా మారింది.
నిజమైన వారసులం మేమే అంటున్న సుధా, ఊర్మిళ గజపతి:
ఆనంద్ గజపతి మొదటి భార్య ఉమ సంతానమే సంచైత గజపతి. ఉమాకి విడాకులు ఇచ్చిన తర్వాత సుధా గజపతిని వివాహమాడారు ఆనంద్ గజపతి. వీరిద్దరి సంతానం ఊర్మిళ గజపతి. సంచైత, ఊర్మిళలో ఆనందగజపతి నిజమైన వారసులెవరన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆనంద్ గజపతి నుంచి ఎప్పుడో విడిపోయి… సురేష్ శర్మ అనే బాలీవుడ్ డైరెక్టర్‌ను వివాహం చేసుకొన్న ఉమా.. ఆ తర్వాత విజయనగరం సంస్థానం వైపు చూడలేదు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ఆనంద్ గజపతిరాజుకి ఎలాంటి సంబంధం లేదని, నిజమైన వారసులం తామేనంటూ సుధా, కుమార్తె ఊర్మిళ గజపతులు వాదిస్తున్నారు. ఆనంద్ గజపతి వీలునామా కూడా రాశారని చెబుతున్నారు.
త్వరలో సుధా కుటుంబం రాజకీయ అరంగేట్రం:
ఓ పక్క మాన్సాస్, సింహాచలం దేవస్థానం బోర్డు చైర్మన్ నియామకానికి సంబంధించి సంచైత, అశోక్ కుటుంబాలకు మధ్య వివాదం కొనసాగుతుండగానే, మరోపక్క సంస్థానం ఆస్తులకు సంబంధించి సుధా, ఊర్మిళ కుటుంబాన్ని కూడా సంచైత వివాదంలోకి లాగడం చర్చనీయాంశం అయ్యింది. సంచైతకు అధికార పార్టీ సపోర్టు ఉండటంతో మిగిలిన రెండు కుటుంబాలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తమ ఆస్తుల వ్యవహారంలో సంచైత కలుగజేసుకోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సుధా గజపతి కుటుంబం… రాజకీయంగానే ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో ఈ కుటుంబం రాజకీయ అరంగేట్రం చేసేందుకు పావులు కదుపుతోందట.
వారిని వైసీపీలోకి రానిస్తారా?
ఇప్పటికే ఈ కుటుంబం సీఎం జగన్ పాలనపై సానుకూల ప్రకటనలు చేశారు. అవకాశం ఇస్తే.. జగన్‌ను కలిసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కూడా పలు ఇంటర్వూల్లో చెప్పుకొచ్చారు. సీఎం జగన్ అవకాశం ఇస్తే త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. సంచైత అధికారికంగా బీజేపీలో ఉన్నా… పరోక్షంగా వైసీపీలోనే పని చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జగన్ ప్రభుత్వం కూడా సంచైతకు అనుకూలంగానే పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు మాన్సాస్, సింహాచలం దేవస్థానం బోర్డు చైర్మన్ పోస్టులను కట్టబెట్టింది. ఈ పరిస్థితుల్లో సుధా, ఊర్మిళలను తమ పార్టీలోకి జగన్ చేర్చుకునేది అనుమానమే. విజయనగరం సంస్థాన వ్యవహారాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న సుధా, ఊర్మిళ కుటుంబాన్ని సంచైత వివాదంలోకి లాగడంతో… ఇప్పుడు వీరికి కూడా రాజకీయ పార్టీలే ఆశ్రయం కల్పించాల్సిన ఆవశ్యం ఏర్పడింది. మరి మున్ముందు ఈ కుటుంబం సంచైత గజపతిని ఎలా ఎదుర్కొంటుంది? ముందుకు ఎలా వెళ్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.