వరంగల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ.. హీట్ పుట్టిస్తున్న ఓరుగల్లు రాజకీయాలు

వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్‌, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అందుకే వలస నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నారు.

వరంగల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ.. హీట్ పుట్టిస్తున్న ఓరుగల్లు రాజకీయాలు

Warangal Politics

Warangal District Politics : ఓరుగల్లు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇద్దరు బీఆర్ఎస్ నేతల జంపింగ్ తో జాతీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ లోనూ రాజకీయం ఇంట్రస్టింగ్ గా మారింది. పార్టీ మారిన నేతలతో పాటు ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న లీడర్లకు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

ఒకరు బీజేపీలోకి, మరొకరు కాంగ్రెస్ లోకి జంప్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాట్ టాపిక్ గా మారారు. ఆరూరి రమేష్ బీజేపీ గూటికి చేరితే.. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌తో జత కట్టారు. ఆ ఇద్దరు లీడర్లకు జాతీయ పార్టీలు ఇచ్చిన ఆఫర్లపై రకరకాల రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి.

అసంతృప్తులను ఎలా సర్దుకుపోతారో..
బీజేపీ గూటికి చేరిన ఆరూరి రమేష్‌ను.. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తోంది బీజేపీ. అయితే బీజేపీలోని ఓ వర్గం ఆయనను వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు రమేష్ అసంతృప్తులను ఎలా సర్దుకుపోతారో అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read : కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. ఆ అభ్యర్థనకు ఆమోదం

పెద్ద చర్చకు దారితీసిన దయాకర్ తీరు..
మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ గూటికి చేరడం జిల్లాలో చర్చగా మారింది. ఉద్యమకారుడైన పసునూరికి రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోవడంతో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా వలస నేతలకు అతీతం కాకపోవడంతో పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.

తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న దయాకర్..
ఇక కాంగ్రెస్‌లో చేరిన పసునూరి దయాకర్ టికెట్ విషయంలో తీవ్ర పోటీనే ఎదుర్కొంటున్నారు. ఓరుగల్లు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల సంఖ్య ఎక్కువే ఉంది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు. అయితే టికెట్ ఇస్తామంటేనే పనునూరి పార్టీ మారాడని ఆయన వర్గీయులు చెబుతున్నారు. టికెట్ కోసం తాటికొండ రాజయ్య తీవ్ర ప్రయత్నమే చేస్తుండటంతో.. ఓరుగల్లు కాంగ్రెస్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

టికెట్ కోసం సీపీఐ పట్టు.. దయాకర్ పరిస్థితి ఏంటో..
మరోవైపు వరంగల్ టికెట్ కోసం సీపీఐ, కాంగ్రెస్ మధ్య పంచాయతీ కొనసాగుతుంది. వరంగల్ సీటు కోసం కామ్రేడ్స్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తుల్లో సీపీఐకి టికెట్ కేటాయిస్తే పసునూరి పరిస్థితి ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్‌, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అందుకే వలస నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నారు. పసునూరి, ఆరూరి రెండు జాతీయ పార్టీల నుంచి బరిలోకి దిగితే.. ఇద్దరు బీఆర్ఎస్ మాజీ నేతలతో పోటీ పడనుంది గులాబీ పార్టీ.

Also Read : చేవెళ్ల నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ.. ఎవరిదో పైచేయి?