Tdp Janasena Bjp Alliance : పవన్ కల్యాణ్ త్యాగం..! ఎట్టకేలకు బీజేపీ-టీడీపీ మధ్య స్నేహానికి బీజం

ఇలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో చంద్రబాబు, పవన్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌ అయినట్లు చెబుతున్నారు.

Tdp Janasena Bjp Alliance : పవన్ కల్యాణ్ త్యాగం..! ఎట్టకేలకు బీజేపీ-టీడీపీ మధ్య స్నేహానికి బీజం

Tdp Janasena Bjp Alliance

టీడీపీ-బీజేపీ-జనసేన.. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు పొడుపులకు మూడు రోజులు పట్టింది. మూడంటే మూడు రోజుల్లోనే అవగాహన కుదిరింది.. పొత్తుకు మూడు పార్టీలు సిద్ధమైనా… ఏదో.. ఇంకేదో ఆశిస్తూ మూడు పార్టీల మధ్య కొనసాగిన దోబూచులాటకు మూడు రోజుల అనంతరం శుభం కార్డు పడింది.

ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన పొత్తుల చర్చలు..
పొత్తు ఉంటుంది.. పొత్తుతోనే పోటీ చేస్తాం.. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నాం.. అయితే ప్రధాన పార్టీలు టీడీపీ, బీజేపీ ఎప్పుడూ ఇలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ, పొత్తుల్లో కీలక భాగస్వామి, జనసేనాని పవన్‌ మాత్రం ఎప్పుడూ ఇదే మాట చెబుతుండే వారు. పవన్‌ పదేపదే పొత్తుల ప్రస్తావన తెచ్చినా.. ఎక్కడో శంకకొట్టేది. కానీ, ఈ నెల 7న మొదలైన చర్చలు మూడు రోజుల తర్వాత కొలిక్కి వచ్చినట్లు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రకటనతో క్లారిటీ వచ్చింది.

ఎట్టకేలకు దోస్తీపై అవగాహన..
టీడీపీ-జనసేన కూటమిలో చేరేందుకు బీజేపీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత.. చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. గత నెలలోనే ఓ సారి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి వచ్చారు చంద్రబాబు. అంతకుముందు అయోధ్య రామాలయం ప్రతిష్ఠోత్సవం సందర్భంగా బీజేపీ-టీడీపీ మధ్య స్నేహం చిగురించడానికి బీజం పడిందంటున్నారు. అది అలా డెవలప్‌ అవ్వడంతో ఎట్టకేలకు దోస్తీపై అవగాహనకు వచ్చారు.

మోదీ కలలను నిజం చేయడానికి ఎక్కువ సీట్లు కావాలన్న షా..
కేంద్రంలో ఎన్‌డీఏ కూటమిని బలోపేతం చేయడంలో భాగంగా టీడీపీతో జతకట్టడానికి సిద్ధమైన బీజేపీ పెద్దలు ఈ నెల 7న చంద్రబాబుతో రెండో దఫా చర్చలు జరిపారు. 7వ తేదీ గురువారం రాత్రి బాబు, పవన్‌ విడివిడిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఇద్దరు నేతలు కలిసి అదేరోజు రాత్రి పదిన్నరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకున్నారు. అదే సమయంలో పొత్తులపై తన మనసులో మాటను చెప్పేశారు చంద్రబాబు. బీజేపీ-జనసేనకు కలిపి 8 పార్లమెంట్‌, 30 అసెంబ్లీ సీట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారు. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో తమకు గరిష్టంగా ఎంపీ సీట్లు కేటాయించాల్సిందిగా కోరారు అమిత్‌షా. కేంద్రంలో ప్రధాని మోదీ వేవ్‌తో మరోసారి గెలుస్తామని.. కానీ, 370 సీట్లు సొంతంగా నెగ్గాలనే ప్రధాని మోదీ కలలను నిజం చేయడానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరారు అమిత్‌షా.

ప్రత్యర్థికి లాభం చేకూర్చడమే అవుతుందన్న చంద్రబాబు..
షా ఎంతలా చెప్పినా.. టీడీపీ అధినేత చంద్రబాబు తన మాటకే కట్టుబడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఓటింగ్‌ ఆధారంగా అంతకుమించి ఎన్ని సీట్లు ఇచ్చినా ప్రత్యర్థికి లాభం చేకూర్చడమే అవుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇలా తొలిరోజు సుదీర్ఘంగా జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో తమ నిర్ణయం చెప్పేందుకు ఓరోజు సమయం అడిగారు కమలనాథులు. దీంతో చంద్రబాబు, పవన్‌ 8వ తేదీ శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. అశోకా రోడ్‌లోని ఎంపీ గల్లా నివాసంలో చంద్రబాబు.. తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌లో పవన్‌ బస చేశారు. అయితే శుక్రవారం ఒడిశా, మహారాష్ట్రతోపాటు కొన్ని ఇతర కార్యక్రమాల వల్ల మళ్లీ చంద్రబాబు, పవన్‌లతో భేటీ కాలేకపోయారు అమిత్‌షా. దీంతో 9వ తేదీ శనివారం కూడా ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది.

అలా.. పొత్తుపై క్లారిటీ..
8వ తేదీ శుక్రవారం ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు, పవన్‌.. రోజంతా తమ క్యాడర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీకి కేటాయించే సీట్లను త్యాగం చేయాల్సిన నేతలతో సంప్రదింపులు జరిపారు. అటు బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్రంలోని తమ ముఖ్యనేతలతో చర్చించింది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ అయి.. ఏ ఏ నియోజకవర్గాలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు. ఇలా ఇరు పార్టీలు శుక్రవారం హోమ్‌వర్క్‌ పూర్తి చేయడంతో 9వ తేదీ శనివారం పొత్తుపై క్లారిటీ వచ్చింది.

త్యాగం చేసిన పవన్
మూడో రోజు సుమారు 50 నిమిషాల పాటు అమిత్‌షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్‌ భేటీ అయ్యారు. చంద్రబాబు ముందుగా ప్రతిపాదించినట్లు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్‌ స్థానాలపైన మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. అయితే బీజేపీ కోరినట్లు ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలిచ్చేందుకు జనసేనాని పవన్‌ ఒక సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. గతంలో మూడు పార్లమెంట్‌ స్థానాలను తీసుకున్న జనసేన.. బీజేపీ కోసం ఒక సీటును వదులుకుని రెండు సీట్లతో సరి పెట్టుకునేందుకు అంగీకరించింది. ఇలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో చంద్రబాబు, పవన్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌ అయినట్లు చెబుతున్నారు.

Also Read : బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు