ఇంటింటికీ రూ.వెయ్యి విలువైన గిఫ్ట్ ప్యాక్‌లు..! అసలు గంటా వ్యూహం ఏంటి?

తన పోటీపై పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం రాకముందే భీమిలిలో గిఫ్ట్‌లు పంచుతున్న గంటా వ్యవహారశైలి హాట్‌టాపిక్‌ అవుతోంది.

ఇంటింటికీ రూ.వెయ్యి విలువైన గిఫ్ట్ ప్యాక్‌లు..! అసలు గంటా వ్యూహం ఏంటి?

Ganta Srinivasa Rao Gift Packs

Updated On : March 5, 2024 / 8:13 PM IST

Ganta Srinivasa Rao Gift Packs : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గంటా మనసులో ఏముంది? ప్రతి ఎన్నికకు తన సీటు మార్చే గంటా ఈసారి పోటీ చేసేది ఎక్కడ? గంటా చాయిస్‌ ప్రకారం భీమిలా? లేక అధిష్టానం చెప్పిన చీపురుపల్లా? తనకు ఇష్టం లేని చోట పోటీ చేయకూడదని భావిస్తున్న గంటా అధిష్టానంపై ఒత్తిడికి ప్రత్యేక వ్యూహం సిద్ధం చేశారా? అందుకే భీమిలిలో గిఫ్ట్‌ పాలిటిక్స్‌కు తెరలేపారా?

ఇప్పటికీ గంటా సీటుపై అస్పష్టత..
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి చర్చనీయంశంగా మారుతోంది. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు.. ఈసారి అక్కడి నుంచి మరో నియోజకవర్గానికి మారాలని కోరుకుంటున్నారు. ఇలా సీటు మారడం ఆయనకు అలవాటైనా.. ఈసారి ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నదే ఇప్పటికీ సస్పెన్స్‌. మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నా, ఇప్పటికీ గంటా సీటుపై క్లారిటీ రావడం లేదు.

అధిష్టానం నిర్ణయంతో షాక్ లో గంటా..
1999లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిన గంటా.. గత పాతికేళ్లలో ఒకసారి పోటీ చేసిన చోట నుంచి మళ్లీ ఇంతవరకు పోటీ చేయలేదు. చోడవరం, భీమిలి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల నుంచి ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఆనవాయితీ ప్రకారం ఈసారి విశాఖ ఉత్తర నుంచి మార్పు కోరుకుంటున్న గంటా.. భీమిలి నియోజకవర్గానికి మారాలని భావిస్తున్నారు. ఐతే ఇటీవల టీడీపీ అధిష్టానం ఆయనను విజయనగరం జిల్లా చీపురుపల్లికి మారాలని సూచించింది. తానొకటి తలిస్తే.. అధిష్టానం మరోలా నిర్ణయించడంతో షాక్‌ తినడం గంటా వంతైంది.

భీమిలిలో ఇంటింటికీ గిఫ్ట్‌ ప్యాక్‌లు పంచుతున్న గంటా అనుచరులు..
అధిష్టానం ప్రతిపాదనపై తన సన్నిహితులతో చర్చించిన గంటా.. ఏమనుకున్నారో ఏమో తాజాగా భీమిలిలో రాజకీయ కార్యకలాపాలు ఉధృతం చేశారు. చీర, సారె పసుపు కుంకాలతో ఏకంగా ఇంటింటికీ గిఫ్ట్‌లు పంచుతున్నారు. ఎన్నికల తాయిళంగా గంటా అనుచరులు ఇంటింటా ఈ గిఫ్ట్‌లు పంపిణీ చేస్తుండటం ఉత్తరాంధ్ర మొత్తం హాట్‌టాపిక్‌గా మారింది. చీపురుపల్లిలో సీనియర్‌ నేత మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి టీడీపీ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున పనితీరుపై సంతృప్తిగా లేని టీడీపీ అధిష్టానం.. గంటా అయితేనే బొత్సకు చెక్‌ చెప్పొచ్చని భావిస్తోంది.

టీడీపీ అధిష్టానం చేసిన సర్వేల్లోనూ గంటాకు విజయావకాశాలు ఉన్నట్లు తేలిందట. కానీ, గంటా వ్యక్తిగతంగా చేసిన సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో చీపురుపల్లి వెళ్లడం ఇష్టంలేని గంటా.. భీమిలి సీటు తనకు సేఫ్‌ అని భావిస్తూ గిఫ్ట్‌ పాలిటిక్స్‌కు తెరలేపారు. ఇలా చేయడం వల్ల తన మనోగతం అధిష్టానం దృష్టికి వెళుతందని భావిస్తున్నారు గంటా.

విశాఖలో తన పట్టు సన్నగిల్లుతుందనే భావన..
సీటు మార్పుపై వివిధ కోణాల్లో ఆలోచిస్తున్న మాజీ మంత్రి గంటా.. గెలుపు ఓటములు కన్నా, విశాఖ జిల్లాను వీడటంపై తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్రంలో కీలకమైన జిల్లా అయిన విశాఖ నుంచి పక్క జిల్లాకు వెళితే.. ఈ ప్రాంతంలో తన పట్టు సన్నగిల్లుతుందని భావిస్తున్నారు గంటా.. మాజీ మంత్రి అనుచరులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి భీమిలి సీటునే ఖాయం చేసుకోవాలని భావిస్తున్నారు గంటా.

వెయ్యి రూపాయలు విలువైన గిఫ్ట్ ప్యాక్ లు..
ఈ కారణంగానే భీమిలి నియోజకవర్గంలో గిఫ్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు గంటా.. మధ్యతరగతి వారు ఎక్కువగా ఉండే అర్బన్‌ ఏరియా అయిన భీమిలి నియోజకవర్గంలో పంచేందుకు సుమారు 50 వేల గిఫ్ట్‌ ప్యాక్‌లను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ గిఫ్ట్‌ ప్యాక్‌లో చీర, పంచె, పసుపు, కుంకుమ ఉన్నాయి. జ్యూట్ బ్యాగ్‌లో పెట్టిన ఈ గిఫ్ట్ ప్యాక్ ఒక్కొక్కటి సుమారు వెయ్యి రూపాయల విలువ చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు పంపిణీ పూర్తి చేయగా, షెడ్యూల్‌కు ముందే మొత్తం గిఫ్ట్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

అధిష్టానం సపోర్ట్ పై ఉత్కంఠ..
తన పోటీపై పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం రాకముందే భీమిలిలో గిఫ్ట్‌లు పంచుతున్న గంటా వ్యవహారశైలి హాట్‌టాపిక్‌ అవుతోంది. ఇలా చేయడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఆశిస్తున్నారు గంటా.. పొత్తుల్లో భాగంగా భీమిలిని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతోపాటు చీపురుపల్లి వెళ్లడం తనకు ఇష్టం లేదనే సంకేతాలు ఇవ్వడమూ ఇందులో భాగమంటున్నారు. మొత్తానికి తన పోటీ ఎక్కడో ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నా గంటాకు అధిష్టానం ఎంతవరకు సపోర్ట్‌ చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Also Read : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?