తెలంగాణలో బీఆర్‌ఎస్ ఆఫీసులకు మూడిందా.. అధికారం తారుమారైతే ఎవరికైనా ఇదే గతా?

ఏపీ మొత్తం అనుమతి లేకుండా నిర్మించిన వైసీపీ ఆఫీసులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే సమయంలో తెలంగాణలోనూ బీఆర్‌ఎస్ భవనాలకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.

తెలంగాణలో బీఆర్‌ఎస్ ఆఫీసులకు మూడిందా.. అధికారం తారుమారైతే ఎవరికైనా ఇదే గతా?

why Congress targets BRS party offices in Telangana

Updated On : July 6, 2024 / 3:55 PM IST

Congress Target BRS Party Offices: తెలంగాణలో బీఆర్‌ఎస్ కార్యాలయాలకు మూడిందా? ఏపీలో మొదలైన రాజకీయం.. తెలంగాణకు విస్తరించిందా? తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయం నేలమట్టం అయినట్లు.. తెలంగాణలో బీఆర్‌ఎస్ కార్యాలయాలను బుగ్గిలో కలిపేసే ప్లాన్ సిద్ధమవుతుందా? అధికార పార్టీ ఆలోచనలేంటి? ప్రతిపక్షం వాదనేంటి? అధికారం తారుమారైతే ఎవరికైనా ఇదే గతా?

బీఆర్‌ఎస్ భవనాలకు నోటీసులు
నల్లగొండలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయండి.. అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా, హైదరాబాద్‌తో సహ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన 33 జిల్లాల్లో కొత్తగా పార్టీ కార్యాలయాలను నిర్మించాలని భావించింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీసులు నిర్మాణం పూర్తియింది. అయితే ఇలా నిర్మించిన కార్యాలయాలకు కొన్నిచోట్ల అనుమతులు లేవన్న విషయం తాజాగా బయటపడటంతో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. ఏపీలో వైసీపీ ప్రధాన కార్యాలయానికి అనుమతులు లేవన్న కారణంతో కొద్ది రోజుల క్రితం కూల్చివేశారు. ఇక ఆ తర్వాత ఏపీ మొత్తం అనుమతి లేకుండా నిర్మించిన వైసీపీ ఆఫీసులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇదే సమయంలో తెలంగాణలోనూ బీఆర్‌ఎస్ భవనాలకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ రాజకీయాలపై ఏపీ ఎఫెక్ట్ పడిందా అన్న చర్చ మొదలైంది.

అనుమతులు లేవని తేలడంతో..
తెలంగాణలో బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాలను నిర్మించాలని భావించిన ఆ పార్టీ హైకమాండ్ 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాల్లో స్థలాలను కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు స్థలాలను కొనుగోలు చేసి ఆఫీసులు నిర్మించింది. ఇప్పటికే కొన్ని పనులు పూర్తయి.. కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడో ఒకటో రెండో మాత్రమే నిర్మాణం పూర్తికాలేదు. ఇక నల్లగొండ పార్టీ ఆఫీసుకు ఎలాంటి అనుమతి లేని విషయం తాజాగా బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆఫీసులకు అనుమతులు ఉన్నదీ లేనిదీ ఆరా తీస్తోంది ప్రభుత్వం. ఇందులో చాలా చోట్ల అనుమతులు లేవని తేలడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కూల్చేయమన్న కోమటిరెడ్డి
నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయాలని కోమటిరెడ్డి ఆదేశాల తర్వాత సూర్యాపేట, భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయాలకు అనుమతి లేదని తేలింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్యాలయాలు నిర్మించగా, పెద్దపల్లి కార్యాలయానికి అనుమతి లేదని గుర్తించారు అధికారులు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్ కార్యాలయాలకు అనుమతులు ఉండగా, కామారెడ్డిలో ఇప్పటివరకు కార్యాలయం నిర్మించలేదు. ఇక్కడ పార్టీ ఆఫీసుకు స్థలం మాత్రం కేటాయించారు.

Also Read : కాంగ్రెస్‌లో కేకే రేపిన తుఫాన్ ఏంటి? వలస నేతలకు వచ్చిన కష్టం ఏంటి?

ములుగులో ఓకే
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఆరు చోట్ల పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించగా, వరంగల్ మినహా జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, ములుగుల్లో బిఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. ఇందులో ములుగులో పార్టీ కార్యాలయానికి అన్ని అనుమతులు ఉన్నాయి. మహబూబాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, జనగామల్లో భవనాలకు అనుమతిలేదని అధికారులు గుర్తించారు. హన్మకొండ కార్యాలయానికి మూడు రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు.

Also Read : మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా.. అడ్డుపడుతున్నది ఎవరు? దేనికోసం?

బీఆర్‌ఎస్ న్యాయపోరాటం
ఇలా రాష్ట్రం మొత్తం బీఆర్‌ఎస్ కార్యాలయాలకు అనుమతులు ఉన్నదీ లేనిదీ తేల్చాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకోవడం, వెనువెంటనే అనుమతులు లేనివాటికి నోటీసులు జారీ చేయడం హీట్‌పుట్టిస్తోంది. ఇప్పటికే ఒకవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఆకర్ష్ వల వేసిన కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న అధికార పార్టీ.. పార్టీ ఆఫీసులకు నోటీసులు ఇస్తూ ఆ పార్టీపై మరింత ఒత్తిడి పెంచుతోంది. అయితే ఇప్పటికే నిర్మాణాలు పూర్తవడం వల్ల ప్రభుత్వం నోటీసులపై బీఆర్‌ఎస్ ఎలా స్పందిస్తున్నది చూడాల్సివుంది. ఐతే పార్టీ ఆఫీసులను కాపాడుకునేందుకు నోటీసులపై కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తోంది బీఆర్‌ఎస్.