రాజమండ్రి రూరల్ లో టీడీపీ  హ్యాట్రిక్ కొడుతుందా ?

  • Published By: chvmurthy ,Published On : February 10, 2019 / 12:46 PM IST
రాజమండ్రి రూరల్ లో టీడీపీ  హ్యాట్రిక్ కొడుతుందా ?

రాజమండ్రి : రాజమండ్రి రూరల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్‌ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో టికెట్‌ దక్కించుకొని బరిలోకి దిగిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ గెలుపొంది హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాత్మకంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.

కడియం మండలం, రాజమండ్రి రూరల్‌తో పాటు కార్పొరేషన్‌ పరిధిలోని కొన్ని డివిజన్లతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఏర్పాటయింది. ఈ అసెంబ్లీ స్థానంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు కాపు అభ్యర్థులను బరిలోకి దించితే, తెలుగుదేశం పార్టీ మాత్రం బీసీ అభ్యర్థి చందన రమేశ్‌ను పోటీ చేయించింది. టీడీపీ బీసీ కార్డు ప్రయోగించడంతో ప్రత్యర్థి పార్టీలు బోల్తా పడ్డాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ తరపున ఆకుల వీర్రాజు పోటీ చేశారు. అప్పుుడు జరిగిన రసవత్తర పోరులో  గోరంట్ల విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

అయితే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి గోరంట్ల పోటీ చేయాలని భావిస్తున్నారు. అధిష్ఠానం గోరంట్లకు సిటీ టికెట్ ఇస్తుందా ? లేదంటే మళ్లీ రూరల్‌ నుంచి పోటీ చేయిస్తుందో వేచి చూడాలి  గోరంట్లకు సిటీ టికెట్ ఇస్తే, రూరల్‌ టికెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు చందన రమేశ్‌. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున తన కుమారుడికి టికెట్‌ ఇస్తే గెలుస్తామని రమేశ్ చెబుతున్నారు. మరోవైపు ఆకుల వీర్రాజుకి వైసీపీ టికెట్‌ కన్ఫర్మ్  చేసింది. మరోసారి ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేశారు. టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్న మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్  జనసేనలోకి  జంపయ్యారు. వచ్చే ఎన్నికల్లో కందుల దుర్గేశ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. రాజమండ్రి రూరల్ టికెట్‌ దుర్గేశ్‌కేనన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. 

తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థులను కన్ఫర్మ్  చేయలేదు. ఆశావహుల మాత్రం ఎవరికి వారే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికను బట్టి రాజమండ్రి రూరల్ రాజకీయాలు మారిపోనున్నాయి. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పార్టీలన్ని ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ కేటాయించే అవకాశం ఉంది.