వైఎస్ వివేకా కేసు.. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు చేశామని, వాటిలో అనేక విషయాలు ఉన్నాయని, త్వరగా విచారణ చేపట్టాలని కోరారు లూథ్రా. తాము కూడా కేసు విచారణ చేపట్టడానికి సిద్ధమే అని.. కానీ, సమయం కూడా అనుకూలించాలి కదా అని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు.

YS Viveka Case
YS Viveka Case : ఏపీలో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ మూడో వారంలో కేసు తుది వాదనలు వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం అయ్యే వారంలో నాన్ మిస్లేనియస్ డే రోజు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీ కి ఆదేశించింది ధర్మాసనం. కేసు డైరీ మొత్తాన్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది ధర్మాసనం.
కేసు డైరీ 60 భాగాలుగా ఉందని కోర్టుకు తెలిపారు సీబీఐ తరపు న్యాయవాది. డిజిటల్ రూపంలోకి మార్చి ఈ-డైరీ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఏప్రిల్ 22కి ముందు కేసు విచారణకు తీసుకునే పరిస్థితి లేదన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈ కేసులో నిందితుడికి మంజూరైన మధ్యంతర బెయిల్ ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు సునీత తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా. ఆ తర్వాత ఇదే కేసులో నిందితుడికి సుప్రీంకోర్టు ఆదేశాలతో రిమాండ్ చేసి, బెయిల్ ఇచ్చారని తెలిపారు లూథ్రా. ఇందుకు సంబంధించిన అనేక అంశాలు పరిశీలించాల్సి ఉందన్నారు.
Also Read : వాళ్లను తిట్టవు నిన్నెలా నమ్మాలని అడిగారు.. జగన్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన వసంత కృష్ణప్రసాద్
మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు చేశామని, వాటిలో అనేక విషయాలు ఉన్నాయని, త్వరగా విచారణ చేపట్టాలని కోరారు లూథ్రా. తాము కూడా కేసు విచారణ చేపట్టడానికి సిద్ధమే అని.. కానీ, సమయం కూడా అనుకూలించాలి కదా అని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. నాన్ మిస్లేనియస్ డే రోజు విచారణ జరుపుతామని, గత విచారణ సందర్భంగా చెప్పారని ధర్మాసనంకు గుర్తు చేశారు సీబీఐ తరపు న్యాయవాది ASG ఎస్.వి రాజు. అందుకనే తాము కూడా విచారణను నాన్ మిస్లేనియస్ డే కే వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు జస్టిస్ ఖన్నా.
Also Read : జనసేనకు సీట్ల కేటాయింపుపై బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు