బీసీ ఓట్లకు వైసీపీ గాలం : ఆదివారం ఏలూరులో బీసీ గర్జనసభ

అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. వీటిలో ముఖ్యంగా బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ వైసీపీ బీసీ గర్జన సభ నిర్వహిస్తోంది. అధికారంలోకి వస్తే బీసీలకు తాము ఏం చేస్తాము అనేది చెప్పేందుకు ఫిబ్రవరి 17 ఆదివారంనాడు ఏలూరులో బీసీ గర్జన సభకు భారీ ఏర్పాట్లు చేశారు ఆ పార్టీ నేతలు. ఈ గర్జన సభలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.
రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గంలోని వివిధ కులాలకు సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసేందుకు బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు జగన్. ఈ అధ్యయన కమిటి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బీసీల సమస్యలు, వారి స్ధితిగతులను అధ్యయనం చేసింది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో నియోజకర్గాల వారీగా తిరిగి బీసీ కులాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వీటితో పాటు బీసీ కులాలకు చెందిన ముఖ్య నేతలు, మేధావులు, ఉద్యోగ, విద్యార్ధి సంఘాల నేతలతోనూ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బీసీల సమస్యలు, వారి స్ధితిగతులపై నేరుగా క్షేత్ర స్థాయి నుండి సలహాలు, సూచనలు సేకరించారు. అధ్యయన కమిటి సేకరించిన అంశాల ముసాయిదాను ఇప్పటికే పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు అందజేశారు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణాన్ని పార్టీ సీనియర్ నేతలు పరిశీలించారు. ఈ సభ నుంచి వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. ఈ డిక్లరేషన్ లో అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అంశాలను పొందుపరచనున్నారు. దీనితోపాటు ఎన్నికల మ్యానిపెస్టోలోనూ ఆయా అంశాలను చేర్చనున్నారు. దీంతో పాటు బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత కల్పిస్తాం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పటికే అధికార పార్టీ “జయహో బీసీ” అంటూ సభ నిర్వహించింది. ఇక వైసీపి బీసీ గర్జన పేరుతో సభ నిర్వహించబోతుంది. మరి బీసీలు వచ్చే ఎన్నికల్లో ఎవరి వైపు ఉంటారో వేచి చూడాలి.