భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి అంకురార్పణ

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అదివారం మార్చి29న అంకురార్పణ జరిగింది. నవమి ఉత్సవాలు ఆలయంలో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అర్చకులు ప్రాకార మండపం వద్దకు శ్రీసీతారాముల వారిని తీసుకొచ్చారు. గోదావరి నుంచి అర్చక స్వాములు తీర్థబిందె తీసుకొచ్చి ఆలయ సంప్రోక్షణ చేశారు.
తదుపరి విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం, పరిషత్తు దక్షిణ, రక్షాబంధనం నిర్వహించారు. మూలమూర్తుల వద్దకు వెళ్లి మూలవిరాట్, ఉత్సవ మూర్తులు, నిత్యకల్యాణ మూర్తులు, పరివార దేవతలకు కంకణాలు తొడిగారు.
భద్రాచలం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి జి.నరసింహులు ఇతిహాస పురాణాద రుత్వికులు 28 మందికి దీక్షా వస్ర్తాలు సమర్పించి కంకణధారణ చేశారు. మార్చి30 సోమవారం ఉదయం గరుడ పటన లేఖన పూజలు వైభవంగా నిర్వహించారు. ధ్వజపట భద్రకమండ లేఖనం, గరుడాదివాసం గావించారు. మంగళవారం మార్చి,31వ తేదీ అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, ఏప్రిల్1న ఎదుర్కోలు ఉత్సవం, 2న శ్రీసీతారాముల కల్యాణం, 3న శ్రీరామ మహాపట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నారు.