సమ్మక్క-సారక్క కు మొక్కలు చెల్లించుకున్న కేసీఆర్

తెలంగాణ కుంభమేళా అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర అతి వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరింది. సీఎం కేసీఆర్ శుక్రవారం కుటుబం సమేతంగా మేడారం సందర్సించారు. నిలువెత్తు బంగారాన్ని సమ్మక్కకు మొక్కుగా చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు పట్టువస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా వనదేవతలకు కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాధోఢ్ ఉన్నారు.
మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా శుక్రవారం సమ్మక్క సారక్కను దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకున్న ఇద్దరు గవర్నర్లు.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. గవర్నర్ తమిళిసైతో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల పూజారులు అమ్మవార్ల ప్రసాదాలను గవర్నర్ తమిళిసైకు అందజేశారు.
సీఎం కేసీఆర్ గవర్నర్ల పర్యటన నేపథ్యంలో మేడారంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వనదేవతలంతా గద్దెలపైనే ఉండడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. దర్శనాల కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇవాళ, రేపు గద్దెలపైనే వనదేవతలు ఉంటారు. శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయనున్నారు అమ్మవార్లు. వనదేవతలను దర్శించుకున్న అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు ఉంటాయని గవర్నర్ పేర్కొన్నారు. మేడారం జాతర ప్రకృతితో మమేకమైందని ఆమె తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవార్లను మొక్కుకున్నానని గవర్నర్ చెప్పారు.