Karthika Masam: కార్తికమాస తొలి సోమవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తిక మాస తొలి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు తెల్లవారుజామునే ..

Karthika Masam
Karthika Masam: కార్తిక మాస తొలి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు తెల్లవారుజామునే కృష్ణా, గోదావరి తీరాల్లో పుణ్యస్నానాలు చేసి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఉదయాన్నే భక్తుల రద్దీతో ప్రముఖ శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. ఏపీలోని నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో యాగంటిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగంటి క్షేత్రంలో ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
కార్తిక తొలి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో వేకువజాము నుంచే రద్దీ నెలకొంది. పెద్దెత్తున భక్తులు తరలివచ్చి భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలో వీరేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జామునుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు గర్భాలయంలో ఆర్జిత, అన్నపూజ సేవలను రద్దు చేశారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తెల్లవారు జామునుంచి ఆలయం వద్ద రద్దీ నెలకొంది.