సోమవారం నుంచి ఏడుపాయల జాతర : ఏర్పాట్లు పూర్తి

మెదక్ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానపల్లి గ్రామంలో ఏడుపాయల వనదుర్గా జాతర మహా శివరాత్రి సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఉత్సవాలు 6వ తేదీ వరకు జరుగుతాయి. జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది.
దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండం వల్ల ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తుంది. నల్లసరపు రాతితో చెక్కి, కొట్టొచ్చినట్టుండే దుర్గామాత రూపంతో అమ్మవారుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. వరాలిచ్చే వన దుర్గామాతగా భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్నది. సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగివున్నది. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా.. పర్యాటక కేంద్రంగా పేరుపొందింది. దీనిని ఒక జాతరగానే కాదు.. జానపద విశిష్టతగా చెప్పవచ్చు.
ఏడుపాయల జాతరకు తెలంగాణ తో పాటు మహారాష్ట్ర,కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ ఏడాది 15 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. కలెక్టర్ ధర్మారెడ్డి గత 2రోజులుగా ఏడుపాయలలోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. వీటిలో 250 మంది వైద్య సిబ్బంది సేవలు అందించనున్నారు.
జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ పటిష్ట బందోబస్తుఏర్పాటు చేస్తోంది. ఎస్పీతో పాటు, ఇద్దరు డీఎస్పీలు బందోబస్తు పర్యవేక్షించనున్నారు. కాగా …ఘనపుర ప్రాజెక్టులో నీటి నిల్వలు లేక పోవటంతో 20 ట్యాంకర్లును అందుబాటులో ఉంచారు.