రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ.. పోటెత్తిన భక్తులు
భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు.

Navaratri 2024: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విజయవాడ దుర్గమ్మ జగన్మాత రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు. చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.
శరన్నవరాత్రుల్లో చివరి అలంకారము శ్రీ రాజరాజేశ్వరీ దేవి. బంగారు రంగుర చీరలో దుర్గమ్మ దర్శనం ఇస్తారు. ఇచ్ఛా, ఙ్ఞాన, క్రియ శక్తులను ఈ మూర్తి భక్తులకు వరంగా అందిస్తుంది. అమ్మవారిని పూజించి లలితా సహస్ర నామ పారాయణ చేస్తే మంచిది. కుంకుమార్చనలు, సువాసినీ పూజలు చేసినా మంచి ఫలితాలు ఉంటాయి.
లడ్డూలు నివేదన చేయాలి. శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్‌తో పాటు అష్టోత్తర శతనామావళి పఠించాలి. అమ్మవారి అవతారం ముగిశాక శ్రీదేవి దండకంతో శరన్నవరాత్రులు ముగుస్తాయి. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం సమయంలో శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్ద అపరాజితాదేవిని పూజించి
శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!
అనే శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి దయతో తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు అందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం.
Swayambhu : ‘స్వయంభు’ షూట్ లో ఆయుధ పూజ.. వీడియో చూశారా?