Makara Jyothi Darshan : శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరులు
మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలకు భారీగా తరలివచ్చారు.

Makara Jyothi Darshan : శబరిమలలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. మంగళవారం సాయంత్రం పొన్నాంబలమేడు కొండల్లో మకర జ్యోతి కనిపించింది. జ్యోతిని తిలకించి అయ్యప్ప స్వామి భక్తులు పులకించిపోయారు. జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి.
మకర జ్యోతిని స్వామి వారి అంశగా అయ్యప్ప భక్తులు విశ్వసిస్తారు. మకర జ్యోతిని ప్రత్యక్షంగా లక్షన్నర మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని అధికారుల అంచనా. అటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన శబరిమలలోని పొన్నాంబలమేడు కొండల్లో కందమల శిఖరంపై దివ్య జ్యోతి దర్శనమిస్తుంది.
మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలకు భారీగా తరలివచ్చారు. దేశంలోని నలు మూలల నుంచి శబరిమలకు తరలివచ్చిన లక్షన్నర మందికి పైగా భక్తులు మకరజ్యోతిని దర్శించుకుని పులకించిపోయారు. ఈ జ్యోతి దర్శనాన్ని అత్యంత అదృష్టంగా భక్తులు భావిస్తారు. మకరజ్యోతి దర్శనం నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Also Read : మహా కుంభమేళా.. పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’.. పోటెత్తిన భక్తజనం