తిరుమలలో ప్రారంభమైన రధసప్తమి వేడుకలు

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ప్రారంభ మయ్యాయి. మాఘ శుధ్ద సప్తమి సూర్య జయంతి రోజు రధ సప్తమి నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మలయప్ప స్వామి వారు ఏడు వాహనాలపై ఊరేగుతూ తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని భక్తులకు ప్రసాదిస్తున్నారు. వాహన సేవల్లో ఉత్సవ మూర్తులను తిలకించేందుకు సోమవారమే వేలాదిగా భక్తులు తిరుమల చేరుకున్నారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మంగళవారం తెల్లవారుఝామున 4 గంటలకు మలయప్పస్వామి వాహన మండపానికి వేంచేయడంతో సప్తవాహన సేవలు మొదలయ్యాయి. మలయప్ప స్వామి వారు ఈ తెల్లవారు ఝూమన సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను అలరించారు. 9 గంటలకు చిన శేషవాహనం పై స్వామి వారు భక్తులకు దర్శనమియ్యనున్నారు. అనంతరం 11 గంటలకు కు గరుడవాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, సాయంత్రం 4 కు కల్పవృక్షవాహనం, 6 గంటలకు సర్వభూపాలవాహనం, రాత్రి 8 నుంచి చంద్రప్రభ వాహనంపై శ్రీవారిని ఊరేగించనున్నారు.