తిరుప్పావై పాశురాలు-గోదాదేవి భక్తి  పారవశ్యం

తిరుప్పావై పాశురాలు-గోదాదేవి భక్తి  పారవశ్యం

Updated On : December 15, 2020 / 3:31 PM IST

Sri Godadevi Thiruppavai special story : తిరుప్పావై అంటే ఏమిటీ? వీటి ప్రాశస్త్యం ఏమిటి?  ఏముంది అందులో ? కేవలం ముప్పై పాటలే కదా అని అనుకోకూడదు. చూడటానికి పైపైకి ఒక కృష్ణ-గోపికల కథగా కనిపిస్తుంది. ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. వీటిలో వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది. అందుకే తిరుప్పావైని ఐదో వేదం అంటారు.

తిరుప్పావై ఏమిటో తెలిసింది, మరి అందరూ చెయ్యవచ్చా? శ్రీకృష్ణుడి కోసం చేసేది “నీవే తల్లివి తండ్రివి …..” అని అందరం చిన్నపుడు చదివిందేకదా. అందరూ చెయ్యవచ్చు ఈ వ్రతం. మరి ఎప్పుడు ఆచరించాలి? ఒక రైతు పంట పండించేందుకు నారు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా, అంతెందుకు పరీక్షలో మంచి మార్కులు రావడానికి తెలతెలవారే సమయంలో లేచి చదివుతాడు ఒక విద్యార్థి. మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం.

సూర్యుడు ధనుః రాశిలో ప్రవేశించి ఉంటాడు. ఆంగ్ల మానం ప్రకారం డిసెంబరు 16 నుండి మొదలై సంక్రాంతి వరకు. ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం. వ్రతం చేసే సమయం తెలిసింది, వ్రతం చేయటం కష్టం కాదా? కాదు, ఇది అతి సులభమైనది. తెలతెల వారే సమయంలో స్నానం చేయ్యటం, ఆరోజు పాశురం చదివి, ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం. ఇక ఆయా పాశురాల అర్థం వినడం అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం. ఇక తిరుప్పావై పాశురాలు రచించిన భక్తశిరోమణి గోదాదేవి గురించి తెలుసుకుందాం.

నీలాతుంగ స్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్థం స్వం శృతిశతశిరస్సిద్ధం అధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్యభుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవాస్తుభూయః
స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధ బందుర జిష్ణవే
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం

భక్తుడికి భగవంతుడిపై సర్వాధికారాలూ ఉంటాయని ప్రపంచానికి తెలిపిన తన్మయి..ఆండాళ్‌ గోదాదేవి. తులసి వనంలో జన్మించి, భట్టనాథ ఆళ్వార్‌కి పెంపుడు బిడ్డయై వటపత్రశాయి భక్తురాలై.. స్వామితో అనన్య సంబంధం పెంచుకొని, తాను ధరించిన పూదండనే తనకి ప్రియమైనదని ఆ దేవుడితోనే అనిపించుకొన్న మహాభక్తురాలు. ఆ స్వామిని పొందడానికి, అలనాటి గోపికల కాత్యాయినీ వ్రతం లాగా, తానూ ప్రధాన గోపికగా ఊహించుకొని, తన స్నేహితురాండ్లని గోపికలుగా తీర్చిదిద్ది, అనన్య భక్తురాలిగా కీర్తింపబడి భక్తులందరూ చూచుచుండగా, శ్రీరంగనాథుడి ఆకాంక్షల మేరకు, జ్యోతిలా మారి ఆయన్నుచేరిన భక్త శిరోమణి.

ఆమె 30 పాశురములు/పాటలు రాసి, పాడి మన కోరికలు తీరడానికి తిరుప్పావై పేరిట భక్తులకు ధార పోసింది. ధనుర్మాసం.. భక్తి పారవశ్యంతో కూడుకున్న పండుగ. గోదాదేవి స్వామి వ్రతం చేసి, నారాయణుని పలువిధాల కీర్తించి కృష్ణమందిరం చేరి, కృష్ణ కుటుంబాన్ని లేపి తాము వచ్చిన కార్యం గురించి విన్నవించుకుంటుంది. తమని ఎలా కటాక్షించాలో కూడా తానే భక్తి వివశయై సూచిస్తుంది.

సింహం గుహ నుండి వచ్చిన విధంగా కృష్ణుడు వచ్చి సభలోకి తమని ఆహ్వానించాలనీ, తమ గురించి స్వయంగా అడిగి తెలుసుకోవాలని.. అప్పుడు తమ కోరికలేమిటో వివరంగా విన్నవించుకోవాలనీ కృష్ణుడికి, ద్వారపాలకుల ద్వారా తెలియపరుస్తుంది. ఆమె సూచించిన మేరకే కృష్ణుడు కొలువు తీరి కుశల ప్రశ్నలు వేసి ‘మీ కోరికలేమిట’ ని అని అడుగుతాడు.

దానికి గోదాదేవి.. ‘కల్యాణ గోవిందా ! మీరు ఈ ఆడపిల్లలందరికి సన్మానం చేయాలి. చేతి ఆభరణాలు గాజులు కంకణాలు, భుజకీర్తులు, కర్ణాభరణాలైన చెవిదిద్దులు, పాదాభరణాలు, మాకు సరిపడే సరిపోయే దుస్తులు ఇవ్వాలి. అవి మాకు నచ్చునట్లుగా మీరే సవరించాలి. మాకు భజించడానికి సంగీత పరికరాలు కావాలి. ఆ తరువాత పాలల్లో మునిగిన అన్నం తింటుంటే నోటి నుండి కారి మోచేతుల మీదుగా ప్రవహించేట్టుగా నెయ్యి ఉండాలి.

ఇంతేకాదు గోవులను కాచే గోవిందా ! నీవు మాలో ఒకడిగా ఉంటూ భుజించాలి. నీకు, మాకు ఉన్న సంబంధం విడదీయరానిది.మనం అంతా గొల్లవారమే…. తెంపినా తెగని సంబంధం. మేము అజ్ఞానులమని విదిలించుకోవద్దు. నీ మీద ప్రేమతో చనువుగా ఉన్నందుకు కోపగించుకోవద్దు. నీ పాదాలని మేము తనివితీరా స్పృశించే విధంగా కడిగే విధంగా మీరు సహకరించాలి’ అంటూ గోదాదేవి భగవత్‌ సాన్నిధ్యాన్ని, అనుభవించి అకారత్రయములైన జ్ఞాన,భక్త, ప్రపత్తులను అనన్యగతిత్వమును, అనన్య శరణత్వమును, అనన్య భోగ్యత్వమును అదేవిధముగా పరమాత్ముడి భక్తవశంకరత్వాన్ని అశేష జనానికి ప్రసారం చేసింది.