Tridandi Chinna Jeeyar Swami : ఆలయాల ఆస్తులు తిరిగి వచ్చేలా చేయాలి- హైందవ శంఖారావం సభలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి
ఆలయాల్లో పూజ ఎంత సేపు చేయాలో ఆఫీసర్ చెప్పాలా? ధర్మాధికారి చెప్పాలా? అని అడిగారు.

Tridandi Chinna Jeeyar Swami కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన హైందవ శంఖారావం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. హైందవ మహాసభ ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, కమలానంద భారతి స్వామితో పలువురు రాజకీయ, హైందవ ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ ఏకతాటి పైకి వచ్చి హైందవ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఆలయాలు బాగుంటేనే అందరం బాగుంటామని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. ఆలయాలకు 15 లక్షల ఎకరాలు ఉండేవని, ఇప్పుడు ఐస్ గడ్డలా కరిగిపోయి నాలుగున్నర లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయన్నారు. ఆలయాలకు ఏం కావాలో ఆఫీసుల్లో కూర్చునే అధికారులు నిర్ణయం తీసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు.
ఆలయాల్లో పూజ ఎంత సేపు చేయాలో ఆఫీసర్ చెప్పాలా? ధర్మాధికారి చెప్పాలా? అని అడిగారు. ఆలయాలను కట్టుకునే మనం, వాటిని నడపలేమా? అని ప్రశ్నించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఆలయాలను తామే నిర్వహించుకుంటామని, అధికారులు అవసరం లేదని చెప్పారు.
ఆలయాల్లో కమిటీలన్నీ రాజకీయంతో నిండిపోతున్నాయని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. ఆలయ ఆస్తులు, ఆచారాలు నాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల ఆస్తులు తిరిగి దేవాలయాలకే వచ్చేలా చేయాలని కోరారు. ఆలయాల్లో జరిగే ఆరాధనలు, సంప్రదాయాల్లో అధికారుల ప్రమేయం ఉండకూడదని సూచించారు. దైవ దర్శనానికి నిబంధనలు పెట్టడంతోనే మత మార్పిళ్లు పెరిగిపోతున్నాయని అన్నారు.
Also Read : తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక పరిశీలనలు