Gautam Gambhir : గంభీర్ కోచ్ పదవికి ఎసరు.. గెలిచిన మ్యాచ్‌ల కంటే ఓడిందే ఎక్కువ..
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

Aakash Chopra says pressure mounting on Gautam Gambhir to deliver as Test coach
ఇంగ్లాండ్ పర్యటనను భారత జట్టు ఓటమితో మొదలెట్టింది. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓ దశలో గెలిచే స్థితిలో కనిపించిన భారత్ ఆపై అనూహ్యంగా తడబడి విజయాన్ని చేజార్చుకుంది. ఈ క్రమంలో సిరీస్‌లో 0-1 స్థితిలో నిలిచింది. ఇక ఇప్పుడు ఎబ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. టీమ్ఇండియా చివరిగా ఆడిన తొమ్మిది టెస్టుల్లో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం అందుకు కారణం. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో భారత్.. బంగ్లాదేశ్ పై రెండు, ఆస్ట్రేలియా పై ఓ టెస్టు మ్యాచ్‌లోనే విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టులు, ఆస్ట్రేలియా పై మూడు టెస్టులు, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. దీంతో గంభీర్ పై చాలా ఒత్తిడి నెలకొంది. రెడ్ బాల్ క్రికెట్‌లో అతడు కోచ్‌గా తన మార్క్‌ను ఇప్పటి వరకు చూపించలేకపోయాడు.’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
ఇక ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాకపోతే గంభీర్ స్థానం ప్రశ్నార్థకంగా మారుతుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే జట్టు బీసీసీఐ, సెలక్టర్లు.. గంభీర్ కోరిన ప్రతీదాన్ని ఇచ్చారు. అతడు అడిగిన ఆటగాళ్లను ఎంపిక చేశారు. అయినప్పటికి ఫలితాలు అనుకూలంగా రాకుంటే అతడికి ఇబ్బందులు తప్పకపోవచ్చు అని చోప్రా చెప్పుకొచ్చాడు.