KKR vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓటమికి కారణాలు చెప్పిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే..
తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం పై కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు.

Courtesy BCCI
ఢిపెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2025లో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తొలి మ్యాచ్‌లో భారీ షాక్ తగిలింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఓటమిపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. మిడిల్ ఓవర్లలో రెండు, మూడు వికెట్లు కోల్పోవడమే తమ ఓటమిని శాసించిందన్నాడు.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే (56; 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (44; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు, యష్ దయాల్, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ తలా ఓ వికెట్ తీశారు.
IPL 2025: తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. బౌండరీల మోతమోగింది..
అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 16.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్‌సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (59 నాటౌట్; 36బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), సాల్ట్ (56; 31బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) లతో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ (34; 16 బంతులు ) దంచికొట్టారు.
అవలీలగా 200 చేస్తారనుకుంటే..
ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్, అజింక్యా రహానేలు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ దశలో కోల్‌కతా ఈజీగా 220కి పైగా పరుగులు చేస్తుందని అంతా భావించారు. అయితే.. కృనాల్ పాండ్యా సంచలన బౌలింగ్‌తో.. వరుసగా వికెట్లు తీయడంతో కేకేఆర్ అనుకున్న దానికన్నా చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
మిడిల్, లోయర్ ఆర్డర్ వైఫల్యమే..
తమ జట్టు ఓటమిపై అజింక్యా రహానే స్పందించాడు. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకొచ్చాడు. తాము బ్యాటింగ్ చేసేటప్పుడు 13వ ఓవర్ వరకు అంతా బాగానే ఉందన్నాడు. అయితే.. వరుసగా రెండు మూడు వికెట్లు కోల్పోవడంతో మూమెంటమ్ దెబ్బతిందన్నాడు. బ్యాటర్లు అత్యుత్తమ షాట్లను ఆడే ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు అవి వర్కౌట్ కాలేదన్నారు.
తాను, వెంకటేశ్ అయ్యర్ ఆడే సమయంలో 200 నుంచి 210 పరుగులు సాధించవచ్చునని చర్చించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే.. వికెట్లు కోల్పోవడంతో అనుకున్న స్కోరును సాధించలేకపోయాం. ఇక డ్యూ ఫ్యాక్టర్ కూడా కొంత ప్రభావం చూపించిందన్నాడు. ఈ మ్యాచ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, అదే సమయంలో తప్పిదాలను దృష్టి పెట్టి ముందుకు సాగుతాం అని రహానే అన్నాడు.