Asia Cup 2025 : పాక్ బౌలర్లను హడలెత్తించిన అభిషేక్ శర్మ.. షాహీన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్.. ఏం జరుగుతుందో అర్థంకాక.. వీడియో వైరల్..

128 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు.

Asia Cup 2025 : పాక్ బౌలర్లను హడలెత్తించిన అభిషేక్ శర్మ.. షాహీన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్.. ఏం జరుగుతుందో అర్థంకాక.. వీడియో వైరల్..

Asia Cup 2025

Updated On : September 15, 2025 / 7:55 AM IST

Asia Cup 2025 : ఆసియా కప్-2025లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేజ్ చేసింది. 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు.

Also Read: Hardik Pandya : చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. పాక్ పై ఒకే ఒక్క భార‌తీయుడు..

128 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ.. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రీదిని ఉతికారేశాడు. భారత ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో అభిషేక్ తొలి బంతినే బౌండరీకి మలిచాడు. రెండో బంతికి లాంగాఫ్ మీదుగా అభిషేక్ కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. మళ్లీ మూడో ఓవర్లోనూ అఫ్రిదిని అభిషేక్ శర్మ ఉతికారేశాడు. ఆ ఓవర్లో అభిషేక్ ఓ ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. దీంతో షాహీన్ అఫ్రిది నిరాశగా చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


అదరగొట్టిన టీమిండియా ప్లేయర్లు..
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లు ఫర్హాన్ (40), షహీన్ అఫ్రిది (33నాటౌట్) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లు కుల్డీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, జస్ర్పీత్ బుమ్రా రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యలు ఒక్కో వికెట్ తీశారు.

పాకిస్థాన్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు అలవోకగా చేధించింది. 15.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ 31 పరుగులతో రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ చేశాడు. 13 బంతుల్లోనే 31 రన్స్ చేశాడు. 2 సిక్సులు, 2 ఫోర్లు బాదాడు.