SL vs PAK : భారత్ చేతిలో ఓటమి.. శ్రీలంకతో పాక్‌కు డూ ఆర్ డై మ్యాచ్.. ఓడితే ఇంటికే..
అబుదాబి వేదికగా పాక్, శ్రీలంక జట్ల (SL vs PAK) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది.

Asia Cup 2025 super 4 today ket match between Sri Lanka and Pakistan
SL vs PAK : ఆసియాకప్ 2025 టోర్నీలో సూపర్-4 దశలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. శ్రీలంక పై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించగా.. పాక్ పై భారత్ గెలుపొందింది. ఇక నేడు పాక్, శ్రీలంక జట్లు (SL vs PAK) కీలక మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇరు జట్లు కూడా సూపర్-4 దశలో తమ తొలి మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఫైనల్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. అబుదాబి ఈ కీలక పోరుకు వేదిక కానుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది.
వరుస విజయాలతో అలవోకగా సూపర్-4కు చేరుకున్న శ్రీలంక జట్టుకు సూపర్-4లో ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. దీంతో మిగిలిన రెండు (పాక్, భారత్)మ్యాచ్‌ల్లో గెలవాల్సిన స్థితిలో లంక నిలిచింది.
మరోవైపు పాక్ ప్రయాణం ఈ టోర్నీలో పడుతూ లేస్తూ అన్న చందంగా సాగుతోంది. గ్రూప్, సూపర్-4 రెండు దశల్లోనూ భారత్ చేతిలో ఓడిపోయింది. ఇక ఇప్పుడు ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక, బంగ్లాదేశ్‌ను పాక్ తప్పక ఓడించాలి. ఈ క్రమంలో లంకతో నేడు అమీతుమీ తేల్చుకోనుంది.
ప్రస్తుతం ఆడుతున్న ఫామ్‌ను బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఫేవరెట్‌గా అడుగుపెట్టనుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 23 టీ20 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 10 మ్యాచ్‌ల్లో లంక విజయం సాధించింది.
అయితే.. చివరి ఐదు టీ20 మ్యాచ్‌ల్లో శ్రీలంకనే విజయం సాధించడం గమనార్హం.