IPL 2025: ఢిల్లీ జట్టుకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్.. డీసీ ప్రకటించిన కొన్నిగంటలకే యూఏఈకి పయనం..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన కొన్నిగంటలకే.. బంగ్లాదేశ్ ప్లేయర్ తన ‘ఎక్స్’ ఖాతాలో దుబాయ్ కు వెళ్తున్న తెలిపాడు.

Bangladesh fast bowler Mustafizur Rahman
IPL 2025: భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఈనెల 17 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటికే ఐపీఎల్ జట్లలోని పలువురు విదేశీ ప్లేయర్లు తమతమ దేశాలకు వెళ్లిపోయారు. వారిలో చాలామంది ఐపీఎల్ లో తదుపరి మ్యాచ్ లలో పాల్గొనేందుకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ వరకు నిబంధనలు సడలించింది. కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బంగ్లాదేశ్ ఎడమచేతి వాటం పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ను జట్టులో తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది.
Also Read: IPL 2025: ఐపీఎల్‌లో మిగిలిన గేమ్స్‌కు దూరమయ్యే విదేశీ ఆటగాళ్లు వీరే.. ఆ జట్లకు బిగ్‌షాక్
ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ మెక్‌గర్క్ స్థానంలో ముస్తాఫిజుర్ రహ్మాన్ ను ఢిల్లీ జట్టు తీసుకుంది. స్వదేశంకి వెళ్లిపోయిన జేక్ మెక్‌గర్క్ తిరిగి రాకపోవటంతో అతడి స్థానంలో ముస్తాఫిజుర్ ను తీసుకుంటున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఒప్పందంపై ముస్తాఫిజుర్ సంతకాలుసైతం చేసినట్లు తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ‘‘రెండు సంవత్సరాల తరువాత ముస్తాఫిజుర్ రెహ్మాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. సీజన్ లో మిగిలిన ఆటలకు అందుబాటులోలేని జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్ స్థానంలో అతను వచ్చాడు’’ అని ప్రకటించింది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించిన కొన్ని గంటలకే ముస్తాఫిజుర్ ఆ జట్టు యాజమాన్యంకు షాకిచ్చాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన కొన్నిగంటలకే.. బంగ్లాదేశ్ ప్లేయర్ తన ‘ఎక్స్’ ఖాతాలో దుబాయ్ కు వెళ్తున్న తెలిపాడు. బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరపున ఆడటానికి యూఏఈ వెళ్లవలసి వచ్చింది. ఎందుకంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందించలేదని తెలుస్తోంది.
Mustafizur Rahman is back in 💙❤️ after two years!
He replaces Jake Fraser-McGurk who is unavailable for the rest of the season. pic.twitter.com/gwJ1KHyTCH
— Delhi Capitals (@DelhiCapitals) May 14, 2025
ముస్తాఫిజుర్ రెహమాన్ తన యుఎఈ టూర్ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో ధృవీకరించారు. విమానంలో పోజులిచ్చిన చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇలా అన్నారు.. “వారితో ఆడటానికి యుఎఈకి వెళ్తున్నాను. నాకు మద్దతుగా ఉండండి.” అంటూ పేర్కొన్నాడు. అయితే, ముస్తాఫిజుర్ ఢిల్లీ క్యాపిటల్స్ లో చేరడంపై ఐపీఎల్ నుంచి ఎటువంటి సమాచారం లేదని, ఫాస్ట్ బౌలర్ ఇప్పటికే తమ జాతీయ జట్టులో చేరాడని బీసీబీ సీఈఓ నిజాముద్దీన్ చౌదరి ఓ స్పోర్ట్స్ న్యూస్ తో చెప్పారు.
యూఏఈలో బంగ్లాదేశ్ జట్టు 17, 19 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఐపీఎల్ -2025 పున: ప్రారంభంలో డీసీ జట్టు ఈనెల 18న గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడనుంది. అయితే, యూఏఈ మ్యాచ్ ల తరువాత బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ ఢిల్లీ జట్టులో చేరే అంశంపైనా స్పష్టత లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టు మే 25 నుంచి పాకిస్థాన్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో పాల్గొనాల్సి ఉంది.
Heading to UAE to play against them. Keep me in your prayers. pic.twitter.com/dI7DHTfj73
— Mustafizur Rahman (@Mustafiz90) May 14, 2025