Vaibhav Suryavanshi : ‘ఇది నాకో సాధారణ విషయం..’ వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు..
తొలి బంతికే సిక్స్ కొట్టడం పై వైభవ్ సూర్య వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Courtesy BCCI
సోమవారం గుజరాత్ టైటాన్స్ పై 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ క్రమంలో అతడి పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దిగ్గజ క్రికెటర్లు, కామెంటేటర్లలతో పాటు నెటిజన్లు సైతం అతడి ఇన్నింగ్స్‌ను మెచ్చుకుంటున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 38 బంతుల్లో 11 సిక్సర్లు, ఏడు ఫోర్లు బాది 101 పరుగులు చేశాడు.
కాగా.. అతడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అతి తక్కువ వయసులో అరంగ్రేటం చేసిన ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు. కాగా.. అరంగ్రేట మ్యాచ్‌లో తొలి బంతినే సిక్స్ గా మలిచిన సంగతి తెలిసిందే. లక్నోతో మ్యాచ్‌లో 20 బంతుల్లో 34 పరుగులు సాధించాడు.
DC vs KKR : ఢిల్లీతో కేకేఆర్ కీలక మ్యాచ్.. ప్లేఆఫ్స్ రేసులో ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే?
గుజరాత్ టైటాన్స్ పై విజయం తరువాత ఐపీఎల్ టీ20 వెబ్‌సైట్‌తో వైభవ్ సూర్యవంశీ మాట్లాడాడు. తొలి బంతికే సిక్స్ కొట్టడం పై స్పందిస్తూ ఇది తనకు సాధారణ విషయం అని చెప్పాడు. తాను టీమ్ఇండియా తరుపున అండర్-19, దేశీయ స్థాయిలో ఆడానని చెప్పుకొచ్చాడు. అక్కడ కూడా తాను తొలి బంతికి సిక్సర్లు కొట్టినట్లుగా వెల్లడించాడు. ఇన్నింగ్స్‌లో మొదటి 10 బంతులు ఆడుతున్నాను అనే ఒత్తిడికి తాను గురికానన్నాడు. బంతి తన రాడార్‌లోకి వస్తే.. దానిని కొట్టడమే తన పని అతడు చెప్పుకొచ్చాడు.
ఇక అరంగ్రేట మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇది ఓ పెద్ద వేదిక, నా ముందు అంతర్జాతీయ బౌలర్ ఉన్నాడు. ఇది మొదటి మ్యాచ్ అని నేను అనుకోలేదు. కేవలం నా ఆట నేను ఆడాను.’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.
తన కోసం తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేశారని చెప్పుకొచ్చాడు. ‘నేను నా తల్లిదండ్రుల వల్లే ఈ స్థితిలో ఉన్నాను. నా ప్రాక్టీస్ షెడ్యూల్ కోసం.. అమ్మ ఉదయం 3 గంటలకే లేస్తుంది. ఆమె రాత్రి 11 తరువాతే నిద్రపోతుంది. ఆమె కేవలం మూడు గంటలు మాత్రమే పడుకుంటుంది. నాకోసం ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. ఇక నాన్న నా కోసం తన పనిని వదిలేశాడు. అన్నయ్య పని చేస్తూ కుటుంబాన్ని ఎంతో కష్టపడి పోషిస్తున్నాడు.’ అని వైభవ్ అన్నాడు.
టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడమే తన తదుపరి లక్ష్యం అని వైభవ్ చెప్పాడు. తనపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకున్న రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. దిగ్గజ ఆటగాడు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వద్ద శిక్షణ పొందడం అనే తన కల నిజమైందన్నాడు. ద్రవిడ్‌తో పాటు జట్టు సహాయక సిబ్బంది, సీనియర్ ఆటగాళ్లు తనకు ఎంతో మద్దతు ఇస్తారన్నాడు.