Shubman Gill : బ్యాటింగ్ ఆస్వాదించడం మానేశాను.. రెండో టెస్టులో భారీ ద్విశతకం తరువాత శుభ్‌మన్ గిల్ కామెంట్స్..
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు

ENG vs IND 2nd Test I stopped enjoying my batting says Shubman Gill
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 387 బంతులు ఎదుర్కొని 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విదేశీ గడ్డ పై అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. గిల్‌కు టెస్టుల్లో ఇదే ద్విశతకం కావడం విశేషం.
గిల్ భారీ డబుల్ సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. జోరూట్ (18), హ్యారీ బ్రూక్ (30) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 510 పరుగులు వెనుకబడి ఉంది.
ఇక రెండో రోజు మ్యాచ్ ముగిసిన తరువాత తన ఇన్నింగ్స్ పై గిల్ స్పందించాడు. టెస్టుల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడడం అంత సులభం కాదన్నాడు. ఈ సిరీస్‌కు ముందు నుంచే అంటే ఐపీఎల్ ముగింపు నుంచే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలిపాడు. ఇప్పటి వరకు తాను పడిన కష్టానికి సరైన ఫలితం వచ్చిందన్నాడు.
ఆకాశ్ దీప్‌పై శుభ్‌మన్ గిల్ ఆగ్రహం.. ‘ఏం చూస్తున్నావు..’ అంటూ.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే?
‘ఇంతక ముందు తాను టెస్టుల్లో నిలకడగా 30-34-40 పరుగులు చేసే వాడిని. కానీ ఏదో ఒక సమయంలో ఏకాగ్రత కోల్పోయేవాడిని. దీంతో దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టాను. 35-40 పరుగులు చేరుకోవడం గురించి లేదా సుదీర్ఘ ఇన్నింగ్స్‌ల గురించి ఆలోచించలేదు.’ అని గిల్ అన్నాడు.
“కొన్నిసార్లు.. మీరు సరళంగా పరుగులు సాధించనప్పుడు, మీరు మీ బ్యాటింగ్‌ను ఆస్వాదించడం మానేస్తారు. పరుగులు సాధించాల్సిన అవసరంపై మీరు ఎక్కువగా దృష్టి పెడతారు. నా బ్యాటింగ్‌లో నేను దానిని కోల్పోయానని నాకు అనిపించింది. నేను చాలా దృష్టి కేంద్రీకరించాను. నా బ్యాటింగ్‌ను నేను అంతగా ఆస్వాదించడం లేదు.” అని గిల్ చెప్పాడు.
1979లో ది ఓవల్ మైదానంలో సునీల్ గవాస్కర్ చేసిన 221 పరుగులు రికార్డును గిల్ అధిగమించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డ పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శుభ్‌మన్ నిలిచాడు.
ఆ క్యాచ్ పట్టడం చాలా బాగుంది..
ఈ మ్యాచ్‌లో చాలా సేపు బ్యాటింగ్ చేసిన గిల్.. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను గిల్ అద్భుతంగా అందుకున్నాడు. దీనిపై మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే గత కొన్ని రోజులుగా తాను స్లిప్‌లో క్యాచ్‌లను ప్రాక్టీస్ చేయలేదన్నాడు. ఈ టెస్టు మొదలైనప్పటి నుంచి బ్యాటింగ్ కోసం క్రీజులోనే ఉండిపోయానని చెప్పాడు. అయినప్పటికి మూడో ఓవర్‌లోనే క్యాచ్ అందుకోవడంఓ చాలా బాగా అనిపించిందన్నాడు.
‘గత మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో పొరబాట్లు చేశాం. కొన్ని క్యాచ్‌లను వదిలివేయడం చాలా నష్టం చేసింది. లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉండేది.’ అని గిల్ అన్నాడు.