ENG vs IND : బుమ్రా లేడు.. ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నా.. డీఎస్పీ సిరాజ్ కామెంట్స్..
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా సీనియర్ పేసర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు.

ENG vs IND 2nd test Mohammed Siraj comments after 6 wickets taken in first Innings
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా సీనియర్ పేసర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. మరో పేసర్ ప్రసిద్ద్ కృష్ణ విఫలమైనా, ఆకాశ్ దీప్ అండతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆరు వికెట్లు తీసి బుమ్రా లేని లోటును తీర్చాడు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది.
మూడో రోజు మ్యాచ్ అనంతరం సిరాజ్ విలేకరుల సమావేశంలో తన ప్రదర్శన పై మాట్లాడాడు. ఈ ప్రదర్శన తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఐదు వికెట్లు ప్రదర్శన కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. గతంలో ఇక్కడ చాలా మంచిగా బౌలింగ్ చేసినా వికెట్లు దక్కలేదన్నాడు. అయితే.. ఇప్పుడు ఆరు వికెట్లు తీయడంతో ఎంతో సంతోషంగా ఉందన్నాడు.
సిరాజ్ భయ్యా.. ఇలా బౌలింగ్ చేస్తే మేము ఆడేదెట్లా..! బిత్తరపోయిన రూట్, స్టోక్స్.. వీడియోలు వైరల్
పిచ్ చాలా మందకొడిగా ఉందని తెలిపాడు. సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో తాను బౌలింగ్ ఎటాక్‌ను లీడింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి పిచ్ పై మరిన్ని ప్రయోగాలకు వెళ్లలేదన్నాడు. సరైన ప్రాంతాల్లో బంతులను విసిరి ఫలితం రాబట్టేందుకు ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు. బుమ్రా లేకపోవడం పెద్ద సవాల్ అని తెలిపాడు. ఇక ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణలకు ఎక్కువ అనుభవం లేకపోవడంతో ప్రత్యర్థి పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావడంపై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. తనకు సవాళ్లు స్వీకరించడం అంటే చాలా ఇష్టం అని అన్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత.. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) భారీ శతకాలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ, హ్యారీ లు ఆరో వికెట్‌కు 303 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో సిరాజ్ ఆరు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Ravindra Jadeja : రవీంద్ర జడేజా కీలక వ్యాఖ్యలు.. నా సమయం ముగిసింది..
180 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28), కరుణ్ నాయర్ (7) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.