సిరాజ్ భయ్యా.. ఇలా బౌలింగ్ చేస్తే మేము ఆడేదెట్లా..! బిత్తరపోయిన రూట్, స్టోక్స్.. వీడియోలు వైరల్

మూడోరోజు (శుక్రవారం) ఆట ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించాడు.

సిరాజ్ భయ్యా.. ఇలా బౌలింగ్ చేస్తే మేము ఆడేదెట్లా..! బిత్తరపోయిన రూట్, స్టోక్స్.. వీడియోలు వైరల్

Mohammed Siraj

Updated On : July 5, 2025 / 7:32 AM IST

IND vs ENG: ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హోమ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు ఇంగ్లాండ్ బ్యాటర్లు హడలిపోయారు.


మూడోరోజు (శుక్రవారం) ఆట ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించాడు. వరుస బంతుల్లో జో రూట్ (22), బెన్ స్టోక్స్ (0) ను పెవిలియన్ బాటపట్టించాడు. ఇంగ్లాండ్ జట్టు మూడో రోజు 77/3 ఓవర్ నైట్ స్కోరుతో ప్రారంభించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 22వ ఓవర్లో నాలుగో బంతిని సిరాజ్ లెగ్‌సైడ్ వేయగా.. జోరూట్ ఆ దిశగానే ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోగా.. రిషబ్ పంత్ సూపర్ డ్రైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. ఆ మరుసటి బంతికే స్టోక్స్‌నుసైతం సిరాజ్ పెవిలియన్ బాటపట్టించాడు.


సిరాజ్ వేసిన బంతిని స్టోక్స్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, బంతి అతని బ్యాట్‌ను తాకుతూ కీపర్ రిషబ్ పంత్ చేతిలోకి వెళ్లింది. దీంతో స్టోక్స్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక, ఆట చివర్లో కొత్త బంతితో ఇంగ్లాండ్ టెయిలెండర్లకు సిరాజ్ చుక్కలు చూపించాడు. వెంటవెంటనే వికెట్లను పడగొట్టాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టి భారత్ జట్టు ఆధిక్యం సాధించడంలో కీలక భూమిక పోషించాడు.


సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో పలుసార్లు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. సిరాజ్ భయ్యా.. ఇలా బౌలింగ్ చేస్తే మేము కొట్టేది ఎట్లా అన్నట్లుగా పలువురు ఇంగ్లాండ్ బ్యాటర్ల హావభావాలు కనిపించాయి. మరోవైపు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.