ENG vs IND : భారత్‌కు ఇంగ్లాండ్ కోచ్ వార్నింగ్.. తొలి గంటలోనే ఆరు వికెట్లు తీస్తాం.. కాస్కోండి
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇ

England coach warns team India ahead of Lord Test final day
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (33) ఉన్నాడు. ఆఖరి రోజు భారత్ మరో 135 పరుగులు చేస్తే విజయం సాధించింది. ఇంగ్లాండ్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం.
ఈ క్రమంలో ఇంగ్లాండ్ సహాయక కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ తమ జట్టు బౌలింగ్ పై నమ్మకం ఉంచుతూ.. భారత్‌కు ఓ వార్నింగ్ ఇచ్చాడు. తొలి గంటలోనే మిగిలిన ఆరు వికెట్లను ఇంగ్లీష్ బౌలర్లు పడగొడతారని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకువెలుతుందన్న ధీమాను వ్యక్తం చేశాడు.
ఈ పిచ్ పై బౌన్స్ కాస్త ఎక్కువగానే ఉంది. బౌలర్లకు పెవిలియన్ ఎండ్‌తో పోలిస్తే నర్సరీ ఎండ్ నుంచి బౌలింగ్ చేసేటప్పుడు కాస్త అదనపు బౌన్స్ లభిస్తోందన్నాడు. ‘ఈ స్లోప్‌ను మరికాస్త ఎక్కువగా యూజ్ చేసుకుని స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులు వేసి వికెట్లు తీయవచ్చు. ఐదో రోజు ఉదయం తొలి గంటలోనే ఆరు వికెట్లు తీయాలని మా జట్టు బౌలర్లకు చెబుతున్నాను. నాలుగో రోజు ఆఖరి సెషన్‌లో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీయడంతో బౌలర్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత బ్యాటర్లు మొదటి గంటలో ఎలా ఆడతారు? మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారు అన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.’ అని మార్కస్ ట్రెస్కోథిక్ తెలిపాడు.
బషీర్ ఫిట్..
మూడో రోజు బౌలింగ్ చేస్తూ బంతిని ఆపే క్రమంలో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ షోయబ్ బషీర్ చేతికి గాయమైంది. వెంటనే అతడు మైదానాన్ని వీడాడు. కాగా.. నాలుగో రోజు అతడు బ్యాటింగ్ కు వచ్చాడు. ఐదో రోజు పిచ్ స్పిన్ కాస్త సహకరిస్తుందనే అంచనాల నేపథ్యంలో అతడు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ క్రమంలో షోయబ్ బషీర్ ఫిట్‌నెస్ పై ట్రెస్కోథిక్ అప్‌డేట్ ఇచ్చాడు. బషీర్ ఫిట్‌గా ఉన్నట్లు చెప్పాడు. జట్టుకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అతడు బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అని ట్రెస్కోథిక్ చెప్పాడు.