IND vs NZ : భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. చూసేందుకు రానున్న విశిష్ట అతిథి.. ఎవరో తెలుసా..?
India vs New Zealand : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి ఓటమే ఎగురని జట్టుగా సెమీఫైనల్‌కు చేరుకుంది.

David Beckham to watch IND vs NZ semi final
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి ఓటమే ఎగురని జట్టుగా సెమీఫైనల్‌కు చేరుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోండగా గత ప్రదర్శననే పునరావృతం చేయాలని కివీస్ ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరా హోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
అటు అభిమానుల్లో కూడా ఈ మ్యాచ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. తమ జట్టే గెలవాలని ఇరు జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ ను చూసేందుకు ఓ విశిష్ట అతిథి రాబోతున్నాడు. అతడు మరెవరో కాదు ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న బెక్‌హమ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. ఈ క్రమంలో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అతడు హాజరు అవుతాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read: రాహుల్, సచిన్ పేర్ల కలయికతో ‘రచిన్’ పేరు పెట్టారా? అసలు విషయం చెప్పిన రచిన్ తండ్రి
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కు పలువురు సినీ, రాజకీయ, మాజీ క్రికెటర్లు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల కోసం వాంఖడే స్టేడియంలో వీఐపీ గ్యాలరీలో టికెట్లను రిజర్వ్ చేసినట్లు సమాచారం.
పరుగుల వరద ఖాయం..
వాంఖడే పిచ్ బ్యాటర్లకు అనుకూలం. ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ నాలుగు మ్యాచులు జరగగా భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువ. ఈ మెగాటోర్నీలో ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలించినా కూడా ఈ విషయం అర్థం అవుతుంది. ఈ నాలుగు మ్యాచుల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజేతగా నిలిచింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకునేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
Also Read : వరల్డ్ కప్ లో శ్రీలంక చెత్త ప్రదర్శనకు జైషానే కారణమట.. అర్జున్ రణతుంగ సంచలన వ్యాఖ్యలు
ఒకవేళ ఛేదన చేయాల్సి వస్తే మొదటి 20 ఓవర్లలలో వికెట్లు కోల్పోకుండా క్రీజులో పాతుకుపోవాలి. ఈ పిచ్ పై ఒక్కసారి బ్యాటర్లు కుదురుకుంటే పరుగులు చేయడం సులభం.