Gautam Gambhir : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ పై గంభీర్ కామెంట్స్.. పాంటింగ్‌కు చురకలు..
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Gambhir Gives Ponting Befitting Reply On Remarks Over Kohli Form
Gautam Gambhir Comments : టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరి ఫామ్ పై తనకు ఆందోళన లేదన్నాడు. కొత్తగా వారు నిరూపించుకోవాల్సింది ఏమీలేదన్నాడు. గత సిరీస్ (కివీస్‌తో టెస్టు సిరీస్) ఫలితంతో వారిద్దరూ కసితో ఉన్నారని, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో వారిద్దరూ గొప్ప ప్రదర్శన చేస్తారన్న ధీమాను వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం ఆసీస్‌కు బయలుదేరే ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఇటీవల గంభీర్, రోహిత్ శర్మ ఫామ్ పై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ చేసిన కామెంట్లపై విలేకరులు ప్రశ్నించగా గంభీర్ స్పందించాడు. అసలు భారత క్రికెట్‌తో రికీ పాంటింగ్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించాడు. అతడు ఆస్ట్రేలియా క్రికెట్ సంగతి చూసుకుంటే మంచిదని హితవు పలికాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిపై తన నమ్మకాన్ని పునరుద్ఘాటించాడు. వారు నెట్స్‌లో కష్టపడుతున్నారన్నాడు. గత సిరీస్ ఫలితంతో వారిద్దరిలో కసి రెట్టింపైందని, డ్రెస్సింగ్స్ రూమ్‌లో అలాంటి కసి ఉండాలన్నారు. ఆసీస్ సిరీస్‌లో రాణిస్తారనే ధీమానే వ్యక్తం చేశాడు.
పాంటింగ్ ఏమన్నాడంటే.?
ఆసీస్‌తో టెస్టు సిరీస్ గెలవాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా భారీగా పరుగులు సాధించాలని పాంటింగ్ అన్నాడు. కోహ్లీని కొనియాడుతూనే గత నాలుగేళ్లుగా టెస్టుల్లో అతడు రెండు సెంచరీలే చేశాడన్నారు. అతడి స్థానంలో టాప్ ఆర్డర్‌లో మరే బ్యాటర్ అయినా ఇన్నాళ్లు జట్టులో కొనసాగడం కష్టమని అన్నాడు. కోహ్లీ తన ఫేమ్‌తోనే కొనసాగుతున్నాడని పరోక్షంగా విమర్శించాడు.