Rishabh Pant : వైస్ కెప్టెన్సీ ఊస్ట్.. రిషబ్ పంత్‌కు గౌతమ్ గంభీర్ క్లాస్.. ఓ సీనియర్ ఆటగాడిగా నువ్వు..
రిషబ్‌పంత్ ను (Rishabh Pant) వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన తరువాత తొలిసారి అతడితో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు.
Gautam Gambhir lectures Rishabh Pant about being senior player
- శనివారం నుంచి అఫ్గాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం
- ఈ మ్యాచ్‌కు ముందు పంత్‌తో గంభీర్ మంతనాలు
Rishabh Pant : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రేపటి నుంచి (శనివారం జూన్ 6) ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముల్లన్‌పూర్‌కు చేరుకున్న భారత జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. కాగా.. రిషబ్‌పంత్ ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన తరువాత తొలిసారి అతడితో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు.
గతేడాది రోహిత్ శర్మ నుంచి శుభ్‌మన్ గిల్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టిన తరువాత అతడికి డిప్యూటీగా పంత్‌ను నియమించారు. అయితే.. ఆ తరువాత పేలవ ఫామ్‌తో పంత్ జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనలు చేశాడు. ఈక్రమంలోనే అతడిని వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు.
ఈ క్రమంలోనే ఓ సీనియర్ ఆటగాడిగా మిగిలిన ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలో అనే విషయంపై పంత్‌కు గంభీర్ పలు సూచనలు చేసినట్లు భారత క్రికెట్ జట్టు సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వెల్లడించాడు.
మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ర్యాన్ టెన్ డస్కటే మాట్లాడుతూ.. పంత్ ఓ సీనియర్ ప్లేయర్‌గా, జట్టులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. నిన్న పంత్, గంభీర్ మధ్య ఈ విషయంపై చర్చ జరిగింది. పరిస్థితులకు తగ్గట్లుగానే ఎలా ఆడాలనే విషయం కూడా వారు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. అందరికి పంత్ ఒక రోల్ మోడల్‌గా నిలుస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
*Shreyas Iyer : టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..! వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఇదిలా ఉంటే.. పంత్ 2025లో 7 టెస్టులు ఆడి 48.38 సగటుతో 629 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లలో అతను ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లలో 27, 2, 7, 13 స్కోర్లు నమోదు చేశాడు. ఇక ఐపీఎల్ 2026లోనూ అతడు పేలవ ప్రదర్శన చేశాడు. 12 మ్యాచ్‌లలో 27.88 సగటుతో 251 పరుగులు మాత్రమే సాధించాడు.
