IND vs AUS : ఆ విషయంలో విరాట్ కోహ్లీ జోలికి వెళ్లకండి.. ఆస్ట్రేలియా క్రికెటర్లకు గ్లెన్ మెక్‌గ్రాత్ కీలక సూచన
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్ గ్రాత్ ఆస్ట్రేలియా ప్లేయర్లకు కీలక సూచనలు చేశారు. ఒకవేళ కోహ్లీ క్రీజులో పాతుకుపోయినా అతనిపై

Virat Kohli and Glenn McGrath
Glenn McGrath: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఈనెల 22న పెర్త్ లో జరగనుంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టెస్టు సిరీస్ భారత్ జట్టుకు ఎంతో కీలకమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే టీమిండియా ఐదు టెస్టుల్లో నాలుగు టెస్టులు గెలవాల్సి ఉంది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ ను భారత్ జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టు గైర్హాజరవనున్న నేపథ్యంలో బ్యాటింగ్ విభాగాన్ని నడిపించాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీపైనే ఉంటుంది.
విరాట్ కోహ్లీ ఫామ్ ఇటీవలికాలంలో గొప్పగాఏమీలేదు. అయితే, ఆస్ట్రేలియాలో కోహ్లీ ట్రాక్ రికార్డు మెరుగ్గానే ఉంది. కోహ్లీ ఫామ్ లోకి వస్తే ఆసీస్ బౌలర్లకు ఇబ్బందికరమేనని ఆస్ట్రేలియా మాజీలు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్ గ్రాత్ ఆస్ట్రేలియా ప్లేయర్లకు కీలక సూచనలు చేశారు. ఒకవేళ కోహ్లీ క్రీజులో పాతుకుపోయినా అతనిపై స్లెడ్జింగ్ చేసే ఆలోచనలు చేయొద్దని సూచించాడు. ఎందుకంటే అతడిని స్లెడ్జింగ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. తిరిగి.. ఆ ప్రభావం ఆసీస్ పైనే పడుతుంది. అదే సమయంలో కోహ్లీ పుంజుకుంటే ఆతడిని ఆపడం ఆస్ట్రేలియా బౌలర్ల తరం కాదంటూ మెక్ గ్రాత్ పేర్కొన్నాడు.
Also Read: ఏంటి ‘పుష్ప3’లో నటిస్తావా..! తిలక్ వర్మను ఆటపట్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఫన్నీ వీడియో వైరల్
భారత జట్టు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంటుంది. ఎందుకంటే.. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో మూడు మ్యాచ్ లలోనూ ఓడిపోయి 3-0తో సిరీస్ ను కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియాతో సిరీస్ వారికి ఎంతో ప్రతిష్టాత్మకం. దీంతో టీమిండియా ప్లేయర్లు ఒత్తిడితోనే మైదానంలోకిదిగే పరిస్థితి ఉంది. విరాట్ కోహ్లీ భారీ స్కోర్లు సాధించకుండా కట్టడి చేయగలిగితే ఆస్ట్రేలియా టీమిండియాపై పైచేయి సాధించినట్లే అవుతుందని గ్లెన్ మెక్ గ్రాత్ పేర్కొన్నాడు.
ఇదిలాఉంటే.. కోహ్లీకి ఆస్ట్రేలియాపై మంచి రికార్డే ఉంది. ఆస్ట్రేలియాలో 13 టెస్టు మ్యాచ్ లలో 54.08 సగటుతో 1,352 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈనెల 22న తొలి టెస్టు పెర్త్ లో జరగనుంది. పెర్త్ లో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఈ వేదికపై టెస్టు సెంచరీ చేసిన ఏకైక ఆసియా బ్యాటర్ కోహ్లీనే కావటం గమనార్హం.