LSG vs MI : లక్నో పై ఓటమి.. ఆ ఒక్క తప్పే కారణమన్నముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. మేం గెలుపు బాట పడితే..
లక్నో పై ఓడిపోవడం తనను తీవ్రంగా బాధించిందని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడో ఓటమిని చవిచూసింది. శుక్రవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం తనను నిరాశ పరిచిందని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. వ్యక్తిగతంగా తాను ఎవరిని తప్పుబట్టను అని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (60; 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఐడెన్ మార్‌క్రమ్ (53; 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లతో రాణించాడు. ట్రెంట్ బౌల్ట్, అశ్వనికుమార్, విఘ్నేష్ పుతూరు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం.. సూర్యకుమార్ యాదవ్ (67; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), నమన్ దీర్ (46; 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినప్పటికి లక్ష్య ఛేదనలో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు విల్ జాక్స్ (5), ర్యాన్ రికెల్టన్ (10)లు విఫలం అయ్యారు. హార్దిక్ పాండ్యా (28 నాటౌట్), తిలక్ వర్మ (25) లు ఫర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రతి తలా ఓ వికెట్ తీశారు.
అదనంగా 10-15 రన్స్..
ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఓటమి తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కొన్ని తప్పులు చేసినట్లుగా అంగీకరించాడు. వాస్తవం చెప్పాలంటే అదనంగా తాము 10 నుంచి 15 పరుగులు ఇచ్చినట్లుగా తెలిపాడు. ఇలాంటి పెద్ద టోర్నీల్లో ఇలాంటి పొరబాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయన్నాడు.
ఇక తాను బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీయడం పై స్పందిస్తూ.. బౌలింగ్ ను తాను ఎప్పుడూ ఆస్వాదిస్తుంటానని చెప్పాడు. తన దగ్గర పెద్దగా ఆప్షన్లు లేవని, పిచ్‌ను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా తెలివిగా బంతులు వేయడానికి ప్రయత్నిస్తుంటానని చెప్పాడు. వికెట్లు తీయాలనే ఆలోచన తాను చేయనని, డాట్ బాల్ వేయాలని భావిస్తుంటానని చెప్పాడు. డాట్ బాల్స్ వేయడం వల్ల ఒత్తిడిలో బ్యాటర్లు తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నాడు.
ఇక బ్యాటింగ్‌లో తాము అనుకున్న స్థాయిలో పరుగులు సాధించలేకపోయామన్నాడు. మ్యాచ్‌లో విజయం సాధించినా, ఓడిపోయినా.. కూడా దాన్ని ఓ జట్టుగానే తీసుకుంటామని పేర్కొన్నాడు. ఇది జట్టు ఆట అని, ఎవ్వరిని వ్యక్తిగతంగా తప్పుబట్టం అని చెప్పాడు. బ్యాటింగ్ యూనిట్ మొత్తం బాధ్యత తీసుకోవాలన్నాడు. తాను కెప్టెన్ కావడంతో ఆ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని చెప్పాడు.
టోర్నమెంట్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, రెండు మూడు విజయాలు సాధిస్తే తాము పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. ఓ జట్టుగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మళ్లీ గెలవడం పెద్ద విషయం కాదు అని హార్దిక్ అన్నాడు.