LSG vs MI : తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ పై ముంబై కోచ్ జయవర్ధనే అలా.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఇలా..
తిలక్ వర్మ రిటైర్ ఔట్ పై మ్యాచ్ అనంతరం ముంబై హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే స్పందించాడు.

Courtesy BCCI
లక్నోలోని ఎకానా స్టేడియంలో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో మరో ఏడు బంతులు మిగిలి ఉండగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ను రిటైర్ చేయాలని ముంబై నిర్ణయం తీసుకుంది. అప్పటికి తిలక్ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
18.5 ఓవర్‌లో తిలక్ అనూహ్యంగా రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికి ముంబై గెలుపునకు 7 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్ గెలవడం కోసం ముంబై ఈ వ్యూహాత్మమైన నిర్ణయం తీసుకుంది కానీ.. ఇది బెడిసికొట్టింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో సునామీ ఇన్నింగ్స్ తో పరుగుల వరద పారించాడు తిలక్. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఎన్నోసార్లు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాంటి ఆటగాడిని రిటైర్డ్ ఔట్ చేయడం పై మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్‌తో పాటు క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
కోచ్ జయవర్థనే ఏమన్నాడంటే..?
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే.. తిలక్ వర్మ రిటైర్ చేయాలనేది తన నిర్ణయం అని చెప్పుకొచ్చాడు. ‘తిలక్ ధాటిగా బ్యాటింగ్ చేస్తాడని మేము ఆశించాము. అలా జరగలేదు. మ్యాచ్ చివరి ఓవర్ల వరకు అయినా అతడు తన లయను కనుగొంటాడని అనుకున్నాము. అప్పటికి కొంత సేపు క్రీజులో ఉన్నా కూడా అతడు ధాటిగా ఆడలేకపోయాడు. తిలక్ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతుండడంతో కొత్త బ్యాటర్ ఎవరైనా వెళ్లి ఆడితే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకనే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నాను.’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు.
Venkatesh Iyer : వెంకటేష్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. ఎక్కువ డబ్బులిచ్చారు కదా అని..
క్రికెట్‌లో ఇలాంటివి జరుగుతుంటాయన్నాడు. అతడిని బయటకు తీసుకురావడం మంచి విషయం కాదు. కానీ వ్యూహాత్మకంగా సరైంది అని జయవర్థనే అన్నాడు.
హార్ధిక్ పాండ్యా ఏమన్నాడంటే..?
మ్యాచ్ అనంతరం తిలక్ రిటైర్డ్ పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. ఆ దశలో మాకు కొన్ని భారీ షాట్లు కొట్టే ఆటగాడి అవసరం ఉంది. అతడు ధాటిగా ఆడలేకపోతున్నాడు. అది కనిపిస్తూనే ఉంది. క్రికెట్ లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. మీరు ఎంత కష్టపడినా కానీ మ్యాచ్‌లో కొన్ని సార్లు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామనేది అర్థమై ఉంటుంది అని హార్దిక్ అన్నాడు.
ఇక తిలక్ స్థానంలో వచ్చిన మిచెల్ సాంట్నర్ రెండు బంతులు ఆడి రెండు పరుగులు మాత్రమే తీశాడు. ఆఖరి ఓవర్‌లో సాంట్నర్‌కు స్ట్రైకింగ్ ఇచ్చేందుకు పాండ్యా ఇష్టపడలేదు.