LSG vs MI : ముంబైకి మ‌తిపోయిందా.. కీల‌క ద‌శలో తిల‌క్ వ‌ర్మ రిటైర్డ్ ఔట్ ఏంది..? ఉండి ఉంటే గెలిచేదేమో..!

తెలుగు ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ‌ రిటైర్ ఔట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

LSG vs MI : ముంబైకి మ‌తిపోయిందా.. కీల‌క ద‌శలో తిల‌క్ వ‌ర్మ రిటైర్డ్ ఔట్ ఏంది..? ఉండి ఉంటే గెలిచేదేమో..!

Courtesy BCCI

Updated On : April 5, 2025 / 8:05 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మ‌రో ఓట‌మిని చ‌విచూసింది. శుక్ర‌వారం ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై 12 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తెలుగు ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ‌ను రిటైర్డ్ ఔట్‌గా మ్యాచ్ మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు పంపారు. ముంబై మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణ‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మొద‌ట బ్యాటింట్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్ (60; 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఐడెన్ మార్‌క్ర‌మ్ (53; 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు బాదారు. ఆయుష్ బ‌దోని (30; 19 బంతుల్లో 4 ఫోర్లు), డేవిడ్ మిల్ల‌ర్ (27; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 5 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. బౌల్ట్‌, అశ్వ‌నికుమార్‌, విఘ్నేష్ పుతూరు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2025: లక్నోతో మ్యాచ్ లో రోహిత్ శర్మ ఎందుకు ఆడలేదు.. కావాలనే తప్పించారా..? అసలు కారణం ఏమిటంటే

అనంత‌రం సూర్య‌కుమార్ యాద‌వ్ (67; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), న‌మ‌న్‌ దీర్ (46; 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ల‌క్నో బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్‌, ఆకాశ్ దీప్‌, అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రతి త‌లా ఓ వికెట్ తీశారు.

7 బంతులు ఉండ‌గా తిల‌క్ రిటైర్డ్ ఔట్..

ఈ మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్‌లో కాస్త ఇబ్బంది ప‌డ్డాడు. 23 బంతులు ఎదుర్కొన్న అత‌డు 25 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేటు 108.70గా ఉంది. తిల‌క్ షాట్లు కొట్టేందుకు ఇబ్బంది ప‌డ‌డంతో అత‌డిని రిటైర్డ్ ఔట్‌గా ర‌మ్మ‌ని ముంబై మేనేజ్‌మెంట్ చెప్పింది.

Venkatesh Iyer : వెంక‌టేష్ అయ్య‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఎక్కువ డ‌బ్బులిచ్చారు క‌దా అని..

దీంతో చేసేది లేక తెలుగు ఆట‌గాడు తిల‌క్ 18.5 ఓవ‌ర్ల త‌రువాత రిటైర్డ్ ఔట్‌గా మైదానం వీడాడు. అత‌డి స్థానంలో ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు మిచెల్ సాంట్న‌ర్ వ‌చ్చాడు. అత‌డు 19 ఓవ‌ర్ చివ‌రి బంతి రెండు ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

ఆఖ‌రి ఓవ‌ర్‌లో 22 ప‌రుగులు..

ముంబై విజ‌యానికి ఆఖ‌రి ఆరు బంతుల్లో 22 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. చివ‌రి ఓవ‌ర్‌ను అవేశ్ ఖాన్ వేశాడు. తొలి బంతిని హార్దిక్ పాండ్యా సిక్స్‌గా మ‌లిచాడు. రెండో బంతికి రెండు ప‌రుగులు రాగా.. ఆ త‌రువాత వ‌రుస‌గా రెండు బంతుల‌కు ప‌రుగులు రాలేదు. హార్దిక్ సైతం సింగిల్ తీసి సాంట్న‌ర్‌కు స్ట్రైకింగ్ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డలేదు. ఐదో బంతికి సింగిల్ తీయ‌గా.. చివ‌రి బంతిని ఎదుర్కొన్న సాంట్న‌ర్ ర‌న్స్ చేయ‌లేక‌పోయాడు.

SRH playoffs scenario : వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఛాన్సుందా? ఇంకా ఎన్ని మ్యాచ్‌ల్లో గెల‌వాలంటే..?

దీంతో అభిమానులు ఇప్పుడు పాండ్యాతో పాటు ముంబై మేనేజ్‌మెంట్ పై మండిప‌డుతున్నారు. తిల‌క్ ను రిటైర్డ్ ఔట్ చేసి మీరు సాధించి ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. క‌నీసం తిల‌క్ ఉండి ఉంటే.. ఆఖ‌రి ఓవ‌ర్‌లో అత‌డు భారీ షాట్లు కొట్టే అవ‌కాశం ఉండేద‌ని, క్రికెట్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేమ‌ని అంటున్నారు. తిల‌క్ స్థానంలో బ‌రిలోకి దిగిన సాంట్న‌ర్‌కు స్ట్రైకింగ్ ఇచ్చేందుకు హార్దిక్ ఎందుకు నిరాక‌రించ‌డాన్ని విమ‌ర్శిస్తున్నారు.