Harmanpreet Kaur : వన్డే ప్రపంచకప్ గెలిచి ఒక్క రోజు కూడా కాలేదు.. అప్పుడే హర్మన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పుకోమంటున్నారుగా.
జట్టు ప్రయోజనాల దృష్ట్యా హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి సూచించింది.
                            Harmanpreet should hand over India captaincy to Smriti Mandhana says Shantha Rangaswamy
Harmanpreet Kaur : హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. టీమ్ఇండియా చరిత్ర సృష్టించిన మరుసటి రోజే.. భారత జట్టు భవిష్యత్తుపై కీలక చర్చ మొదలైంది. జట్టు ప్రయోజనాల దృష్ట్యా హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి సూచించింది. వైస్ కెప్టెన్ అయిన స్మృతి మంధానకు ఆ బాధ్యతలను అప్పగించాలని కోరింది.
హర్మన్ (Harmanpreet Kaur)వయసు 36 ఏళ్లు అని.. ఈ క్రమంలోనే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పింది. హర్మన్ అద్భుతమైన బ్యాటర్ మాత్రమే కాదని అగ్రశ్రేణి ఫీల్డర్ అని తెలిపింది. కెప్టెన్సీ అనే బరువు లేకుండా ఉంటే ఆమె తన కెరీర్‌ను మరికొంత కాలం పొడిగించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.
Rising Stars Asia Cup 2025 : కెప్టెన్‌గా జితేశ్ శర్మ.. వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యకి చోటు..
‘ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. హర్మన్ అద్భుతమైన బ్యాటర్, ఫీల్డర్. అయితే.. వ్యూహాత్మకంగా ఆమె కొన్ని సార్లు తడబడుతోంది. కెప్టెన్సీ భారం అనేది లేకుంటే ఆమె తన బ్యాటింగ్ పై దృష్టి సారించగలదు. అప్పుడు జట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. ఆమెలో ఇంకో మూడు, నాలుగేళ్ల ఆట ఉంది. ఇలాంటి విజయం సాధించినప్పుడు ఇలాంటి సూచన చేయడం కఠినంగా అనిపిస్తుంది. కానీ భారత క్రికెట్ మేలు కోసం తప్పడం లేదు. ఇది చాలా అవసరం.’ అని శాంత రంగస్వామి అన్నారు.
హర్మన్ స్థానంలో 29 ఏళ్ల స్మృతి మంధానకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని శాంత రంగస్వామి కోరింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్, 2029లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జట్లను సిద్ధం చేయాల్సి ఉందని అంది. ఈ సందర్భంగా ఈ ఏడాది పురుషుల క్రికెట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధించినప్పటికి కూడా రోహిత్ శర్మను జట్టు ప్రయోజనాల కోసం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన విషయాన్ని గుర్తు చేసింది.
ఇక మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ విజయం పై స్పందించింది. ఈ విజయంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే మహిళల సంఖ్య పెరుగుందని చెప్పింది. మెగాటోర్నీకి జట్టును ఎంపిక చేసిన చీప్ సెలక్టర్ నీతూ డేవిడ్ బృందాన్ని ఆమె అభినందించింది.
