Ind Vs Aus: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
బ్యాటర్లే కాదు మన బౌలర్లూ చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు.

Courtesy @ EspnCricinfo
Ind Vs Aus: మన కుర్రాళ్లు కుమ్మేశారు. దీంతో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా అండర్ 19తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని యువ భారత్ అలవోకగా చేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 225 పరుగులే చేసింది. 226 రన్స్ టార్గెట్ ను భారత్ 30.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 227 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో అభిజ్ఞాన్ కుందు, వేదాంత్ త్రివేది హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అభిజ్ఞాన్ కుందు 74 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. వేదాంత్ త్రివేది 69 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 8 ఫోర్లు కొట్టాడు.
ఇక ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. జట్టుకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వైభవ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు. 22 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.
ఎలాంటి బెరుకు లేకుండా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు వైభవ్. అతడు కొట్టే షాట్లకు ప్రత్యర్థి బౌలర్ల దిమ్మతిరిగిపోయింది.
వైభవ్ ఇచ్చిన అదిరిపోయే ఆరంభంతో.. తర్వాత వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం లభించింది. తక్కువ పరుగులకే వైభవ్ ఔట్ అయినా.. అప్పటికే చేయాల్సిన విధ్వంసం చేసేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్.. మిగతా పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్ ఆయుష్ మాత్రే నిరాశపరిచాడు. 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 తో ఆధిక్యం సాధించింది.
హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిజ్ఞాన్ కుందు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. బ్యాటర్లే కాదు మన బౌలర్లూ చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు. హెనిల్ పటేల్ 3 వికెట్లు తీసి ఆసీస్ ను దెబ్బకొట్టాడు. కిషన్ కుమార్, కనిష్క్ చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. అంబ్రిష్ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత్, ఆసీస్ మధ్య రెండో వన్డే ఈ నెల 24న, మూడో వన్డే 26న జరగనున్నాయి.
Also Read: ఎట్టకేలకు మౌనం వీడిన యశస్వి జైస్వాల్.. ఆసియాకప్ 2025లో చోటు దక్కకపోవడంపై..