హమ్మయ్య.. పరువు నిలిపావయ్య రాహుల్.. దెబ్బకు ఇంగ్లాండ్ బజ్‌బాల్ క్రికెట్‌కు బ్రేక్.. వీడియో వైరల్.. లేదంటే భారత బౌలర్లకు..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిక్యాన్ని కొనసాగించింది.

హమ్మయ్య.. పరువు నిలిపావయ్య రాహుల్.. దెబ్బకు ఇంగ్లాండ్ బజ్‌బాల్ క్రికెట్‌కు బ్రేక్.. వీడియో వైరల్.. లేదంటే భారత బౌలర్లకు..

KL Rahul

Updated On : July 25, 2025 / 8:58 AM IST

IND vs ENG 4th test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిక్యాన్ని కొనసాగించింది. 264/4తో గురువారం ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఆశించిన స్థాయిలో స్కోర్ చేయలేక పోయింది. లోయర్ ఆర్డర్ మరోసారి నిరాశపర్చింది. తొలి రోజు గాయంతో మైదానం వదిలి వెళ్లిపోయిన రిషబ్ పంత్ రెండోరోజు క్రీజులోకి వచ్చాడు. గాయంతో ఇబ్బందిపడుతూనే పంత్ ఆఫ్ సెంచరీ (54) పూర్తి చేశాడు. మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టారు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 358 పరుగులకు ఆలౌట్ అయింది.

Also Read: 41ఏళ్ల వయస్సులో ఏంది సామీ ఈ బాదుడు.. ఇంగ్లాండ్‌పై విధ్వంసం సృష్టించిన ఏబీ డివిలియర్స్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

మూడో టెస్టులో బజ్‌బాల్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్ జట్టు మాంచెస్టర్ లో మళ్లీ తనదైన శైలిలో బ్యాటుకు పని చెప్పింది. ఓపెనర్లు డకెట్, క్రాలీ దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. బజ్‌బాల్ క్రికెట్‌తో ఓపెనర్లు వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో చూస్తుండగానే ఇంగ్లాండ్ స్కోర్ 150 పరుగులు దాటేసింది. జోరుమీదున్న క్రాలీ (84) జడేజా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. క్రాలీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే, తొలుత అంపైర్లు ఔట్ ఇవ్వలేదు.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. రాహుల్ బంతిని అందుకునే క్రమంలో బంతి నేలను తాకినట్లు అంపైర్లు భావించారు. కానీ, థర్డ్ అంపైర్ రివ్యూలో బంతి నేలను తాకకముందే రాహుల్ క్యాచ్ అందుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో క్రాలీ పెవిలియన్ బాటపట్టాడు.


166 పరుగుల వద్ద క్రాలీ రూపంలో తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీయడంతో ఎట్టకేలకు భారత్‌కు ఊరట లభించినట్లయింది. ఒకవేళ కేఎల్ రాహుల్ ఆ క్యాచ్‌ను అందుకోకుంటే ఇంగ్లాండ్ స్కోర్ మరింత వేగంగా దూసుకెళ్లేంది. క్రాలీ ఔట్ అయిన కొద్దిసేపటికే సెంచరీకి చేరువైన డకెట్ (94) అరంగ్రేట బౌలర్ కాంబోజ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ బ్యాటర్లు బజ్‌బాల్ బ్యాటింగ్‌ను పక్కనపెట్టి వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ పరుగులు రాబట్టారు. దీంతో రెండోరోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.

మూడో రోజు భారత బౌలర్లు విజృంభించకుంటే ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. క్రీజులో పోప్ (20 నాటౌట్), రూట్ (11 నాటౌట్) ఉన్నారు. మూడో రోజు (శుక్రవారం) ఆటలో ప్రారంభంలోనే భారత బౌలర్లు వికెట్లు పడగొట్టాలి. లేదంటే.. ఇంగ్లాండ్ బ్యాటర్లు బజ్‌బాల్ బ్యాటింగ్‌తో విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్, జడేజాలు ఎలాంటి వ్యూహంతో బౌలింగ్ చేస్తారనేది వేచి చూడాల్సిందే.