Virat Kohli : నాకు అది నచ్చదు.. గతంలో ధోని విషయంలోనూ ఇలాగే చేశారు.. కోహ్లీ కామెంట్స్ వైరల్
తొలి వన్డేలో సెంచరీ చేజారినందుకు తనకు ఏ మాత్రం బాధగా లేదన్నాడు విరాట్ కోహ్లీ (Virat Kohli).
IND vs NZ 1st ODI Virat Kohli comments after received Player of the Match award
- తొలి వన్డేలో భారత్ విజయం
- కీలక పాత్ర పోషించిన కోహ్లీ
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం
Virat Kohli : వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (93; 91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న క్రమంలో కోహ్లీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. సెంచరీ చేజారినందుకు తనకు ఏ మాత్రం బాధగా లేదన్నాడు. జట్టు గెలుపే తనకు ఎంతో ముఖ్యం అని చెప్పుకొచ్చాడు.
ఎన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చాయి అనే ప్రశ్న పై స్పందిస్తూ నిజం చెప్పాలంటే తనకు తెలియదన్నాడు. ఆ అవార్డులు అన్నింటిని గురుగావ్‌లోని అమ్మ ఇంటికి పంపిస్తానని కోహ్లీ తెలిపాడు. ఎందుకంటే వాటిని దాచుకోవడం ఆమెకు చాలా ఇష్టం అని తెలిపాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకోవడం పై మాట్లాడుతూ.. తన ప్రయాణం మొత్తాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ కల నిజమైనట్లుగా అనిపిస్తుందన్నాడు.
తన శక్తి, సామర్థ్యాల గురించి తనకు ఎప్పుడూ తెలుసునని, కానీ ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నాడు. తాను కోరుకున్న దానికంటే దేవుడు తనకు చాలా ఎక్కువ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. అందుకు తాను కృతజ్ఞతతో ఉంటానని చెప్పాడు.
VIRAT KOHLI IN THE POST MATCH PRESENTATION. ❤️pic.twitter.com/stK3bwBh26
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 11, 2026
వన్డేల్లో 54వ సెంచరీ గురించి ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నపై మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే తాను మైలురాళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించనని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఒకవేళ భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే తాను ఇంకా దూడుకుగా ఆడేవాడినని అన్నాడు. లక్ష్య ఛేదనలో ఎల్లప్పుడూ తాను పరిస్థితికి తగ్గట్టుగా ఆడాల్సి ఉంటుందన్నాడు. జట్టుకు విజయ తీరాలకు చేర్చడమే తన లక్ష్యమన్నాడు.
నాకు అది నచ్చదు..
మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు పరిస్థితి క్లిష్టంగా ఉంటే.. అడ్డదిడ్డంగా ఆడకుండా ఎదురుదాడి చేయాలనేది తన ఆలోచని అని తెలిపాడు. తొలి 20 బంతుల్లోనే తాను దూకుడుగా ఆడితే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలం అని అనిపించిందన్నాడు. అందుకే వేగంగా ఆడానని అన్నాడు.
IND vs NZ : అందుకే మేం ఓడిపోయాం.. ఆ ఒక్క పని చేసుంటేనా.. కివీస్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్
తాను బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ప్రేక్షకులు కేరింతలు కొట్టడం గురించి గురించి మాట్లాడుతూ.. ‘నా కంటే ముందు బ్యాటర్ ఔట్ అయినప్పుడు ప్రేక్షకులు నా కోసం అరవడం అసలు నచ్చదు. గతంలో ధోని విషయంలోనూ ఇలాగే జరిగింది. ప్రేక్షకుల ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను. గానీ ఔట్ అయి పెవిలియన్‌కు వెలుతున్న ఆటగాడికి ఇది మంచి అనుభూతి కాదు. ‘అని కోహ్లీ అన్నాడు.
ఇక ప్రేక్షకులు తన ఆటను చూసేందుకు రావడం తన అదృష్టం అని అన్నాడు. ఇక అభిమానుల ముఖాల్లో చిరునవ్వును చూడడం తనకు ఎంతో ఇష్టం అని చెప్పాడు.
