IND vs SA : వికెట్ కీపింగ్‌లో మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేసిన జితేశ్ శర్మ
మంగళవారం కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో (IND vs SA) భారత వికెట్ కీపర్ జితేశ్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
IND vs SA 1st T20 Jitesh Sharma equals MS Dhoni wicket keeping record
IND vs SA : స్వదేశంలో టీ20 మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు టీమ్ఇండియా వికెట్ కీపర్ జితేశ్ శర్మ. మంగళవారం కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెర్రీరా, కేశవ్ మహారాజ్ ల క్యాచ్‌లు అందుకున్నాడు జితేశ్. యాదృచ్చికంగా ధోని కూడా కటక్‌లోనే 2017లో శ్రీలంక పై ఈ ఫీట్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో ధోని నాలుగు ఔట్‌లలో పాలుపంచుకున్నాడు. అందులో రెండు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్‌లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా భారత్ తరుపున టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డు ఇప్పటికి ధోని పేరిటే ఉంది. ధోని ఓ టీ20 ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు అందుకున్నాడు. 2018లో ఇంగ్లాండ్ పై బ్రిస్టల్ వేదికగా ధోని ఈ ఘనత సాధించాడు.
టీ20ల్లో భారత్ తరుపున ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లలో పాలు పంచుకున్న కీపర్లు వీరే..
* ఎంఎస్ ధోని – 2018లో ఇంగ్లాండ్ పై 5 క్యాచ్‌లు (బ్రిస్టల్)
* ఎంఎస్ ధోని – 2010లో అఫ్గానిస్తాన్ పై 4 క్యాచ్‌లు (సెయింట్ లూయిస్)
* ఎంఎస్ ధోని – 2017లో శ్రీలంకపై 4 ఔట్‌లు (రెండు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్‌లు) (కటక్)
* దినేశ్ కార్తీక్ – 2022లో ఇంగ్లాండ్ పై 4 ఔట్‌లు (3 క్యాచ్‌లు, 1 స్టంపింగ్) (సౌతాంప్టన్)
* జితేశ్ శర్మ – 2025లో దక్షిణాఫ్రికా పై 4 క్యాచ్‌లు (కటక్)
ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (59 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్థశతకాన్ని బాదడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 101 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లిపోయింది.
