IND vs SA : మూడో టీ20లో ఓట‌మి.. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ కామెంట్స్.. ఆ త‌ప్పిదం వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటే భార‌త్‌కు చుక్క‌లే..

ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో (IND vs SA) ద‌క్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

IND vs SA : మూడో టీ20లో ఓట‌మి.. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ కామెంట్స్.. ఆ త‌ప్పిదం వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటే భార‌త్‌కు చుక్క‌లే..

IND vs SA 3rd T20 Aiden Markram Comments after South Africa lost to India

Updated On : December 15, 2025 / 8:38 AM IST

IND vs SA : ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా ప్ర‌స్తుతానికి 1-2 తేడాతో వెనుక‌బ‌డి ఉంది. కాగా.. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ఓట‌మి పై ఆ జ‌ట్టు కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ స్పందించాడు. భార‌త బౌల‌ర్ల అసాధారణ ప్ర‌ద‌ర్శ‌న‌, వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డం, ఆ త‌రువాత అభిషేక్ శ‌ర్మ విధ్వంసం వ‌ల్లే తాము ఓడిపోయామ‌న్నాడు. 150 ప‌రుగులు చేసి ఉంటే ఫ‌లితం మ‌రో ర‌కంగా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఈ మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 117 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో మార్‌క్రమ్‌ (61; 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. మిగిలిన వారిలో డోనోవన్ ఫెరీరా (20), అన్రిచ్ నార్ట్జే (12) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. రీజా హెండ్రిక్స్ డ‌కౌట్ కాగా.. క్వింట‌న్ డికాక్ (1), డెవాల్డ్ బ్రెవిస్(2), ట్రిస్టన్ స్టబ్స్(9) లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్ లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబె లు చెరో వికెట్ తీశారు.

Hardik Pandya : చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భార‌తీయుడు..

ఆ త‌రువాత 118 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 15.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో అభిషేక్‌ శర్మ (35; 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (28; 28 బంతుల్లో 5 ఫోర్లు), తిలక్‌వర్మ (26 నాటౌట్‌; 34 బంతుల్లో 3 ఫోర్లు) లు రాణించారు. ఈ గెలుపుతో భార‌త్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

150 ప‌రుగులు చేసి ఉంటే..

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై మార్‌క్ర‌మ్ మాట్లాడాడు. మ్యాచ్ ఆరంభంలో ప‌రిస్థితులు చాలా క‌ఠినంగా ఉన్నాయ‌న్నాడు. టీమ్ఇండియా బౌల‌ర్లు స‌రైన లెంగ్త్‌లో బౌలింగ్ వేయ‌డంతో బ్యాటింగ్ చేయ‌డం క‌ష్టంగా మారింద‌న్నాడు. ‘వ‌రుస‌గా నాలుగు, ఐదు, ఆరు వికెట్లు కోల్పోయాం. క్రెడిట్ భార‌త బౌల‌ర్ల‌కు ఇవ్వాల్సిందే. భ‌విష్య‌త్తులోనూ ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైతే వాటిని ఎదుర్కొని, బౌల‌ర్ల‌పై ఒత్తిడి తీసుకురావ‌డానికి మార్గాలు క‌నుగొనాల్సి ఉంది. ‘అని మార్‌క్ర‌మ్ అన్నాడు.

SMAT 2025 : య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచ‌రీ.. ముంబై ఘ‌న విజ‌యం..

టీమ్ఇండియా బౌల‌ర్లు ప‌రుగులు చేసేందుకు పెద్ద‌గా అవ‌కాశాలు ఇవ్వ‌లేదన్నాడు. ఇక తాను ఆఖ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పుకొచ్చాడు. ఒక‌వేళ తాము 140 లేదా 150 ప‌రుగులు చేస్తే అప్పుడు మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగి ఉండేద‌న్నాడు. ఇక టీమ్ఇండియా స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో ఆడుతోంద‌న్నాడు. ముఖ్యంగా అభిషేక్ శ‌ర్మ త‌న దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను త‌మ నుంచి వేగంగా లాగేసుకున్నాడ‌ని చెప్పాడు.

‘అభిషేక్ విధ్వంసంతో భార‌త్ ప‌వ‌ర్ ప్లేలోనే 60 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత మేం పుంజుకున్నాం. బౌల‌ర్లు స‌రైన ప్రాంతాల్లో బంతులు వేశారు. మ్యాచ్‌ను సాధ్య‌మైనంత చివ‌ర‌కు తీసుకువెళ్లాం. ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం.’ అని మార్‌క్ర‌మ్ అన్నాడు.