IND vs NZ: తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు.. తక్కువ పరుగులకే ఆలౌట్.. ఆ ముగ్గురు మినహా..

న్యూజిలాండ్ తో తొలి టెస్టు తొలిఇన్సింగ్ లో తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయిన భారత్ జట్టు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనూ అదే తరహా ఆటతీరుతో...

IND vs NZ: తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు.. తక్కువ పరుగులకే ఆలౌట్.. ఆ ముగ్గురు మినహా..

IND vs NZ 2nd test

Updated On : October 25, 2024 / 1:29 PM IST

IND vs NZ 2nd test: టీమిండియా ఆటతీరులో ఏమాత్రం మార్పు రాలేదు. న్యూజిలాండ్ తో తొలి టెస్టు తొలిఇన్సింగ్ లో తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయిన భారత్ జట్టు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనూ అదే తరహా ఆటతీరుతో అభిమానులను నిరాశ పర్చింది. 16 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 103 పరుగుల వెనుకంజలో ఉంది.

 

మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా వికెట్ల పతనం ప్రారంభమైంది. తొలుత శుభ్‌మ‌న్ గిల్ (30) మిచెల్ శాన్‌ట్న‌ర్‌ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. కొద్దిసేపటికే యశస్వి జైస్వాల్ (30) పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ డారిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ దూకుడుగా ఆడాడు.. ఈ క్రమంలో 19 బాల్స్ ఎదుర్కొని 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ లో స్వల్ప పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. 24 బంతులు ఎదుర్కొని 11 పరుగులుచేసి సర్ఫరాజ్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రవిచంద్ర అశ్విన్(4) మిచెల్ శాన్ ట్నర్ బౌలింగ్ ఎల్బీ డబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (38), ఆకాశ్ దీప్ (6), జస్ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

 

తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, జస్ర్పీత్ బుమ్రా డకౌట్ కాగా.. కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ (30), శుభమన్ గిల్ (30), రవీంద్ర జడేజా (38) మినహా మిగిలిన వారు 20 పరుగుల స్కోరు ను కూడా దాటలేదు. ఐదుగురు బ్యాటర్లు రెండంకెల స్కోర్ కూడా చేయలేక పోయారు.

న్యూజిలాండ్ బౌలింగ్ లో.. మిచెల్ శాన్ ట్నర్ 7 వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్ రెండు, టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు.