పాక్‌తో ఇక ఐసీసీ టోర్నీల్లోనూ భారత్ ఆడకూడదు అంతే..: గంగూలీ
"ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు" అని గంగూలీ చెప్పారు.

భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. పాకిస్థాన్‌తో భారత్ తన క్రికెట్ బంధాలన్నింటినీ తెంచుకోవాలని.. ఐసీసీ, ఆసియా టోర్నమెంట్లలో కూడా పాక్‌తో ఆడకూడదని అన్నారు.
“పాకిస్థాన్‌తో భారత్ అన్ని బంధాలను 100 శాతం తెంచుకోవాలి. భారత్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రతి ఏడాది ఇలాంటి దాడులు జరుగుతున్నాయి.. ఇదేం జోక్ కాదు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు” అని గంగూలీ చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు భీకర హత్యాకాండను సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు చాలా దగ్గర నుంచి కాల్పులు జరిపారు.
ఈ దాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెంట్ ఫోర్స్’ పాల్పడ్డ ఈ ఘాతుకంతో భారత్ యావత్తు రగిలిపోతోంది. ఈ ఘటనతో భారత్-పాక్ మధ్య ఉద్రికత్తలు మరింత తీవ్రమయ్యాయి.
పహల్గాం దాడిని భారత క్రికెటర్లు ఖండించగా పాక్ నుంచి డానిశ్ కనేరియా తప్ప మిగతా పాకిస్థాన్ క్రికెటర్ల నుంచి స్పందనలేదు. ఇప్పటికే పాకిస్థాన్‌లో భారత క్రికెట్ జట్టు ఆడడం లేదు. టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌కు వెళ్లింది. అలాగే, 2012 – 13లో భారత్ వేదికగా పాక్-ఇండియా మధ్య చివరి ద్వైపాకిక్ష సిరీస్ జరిగింది. అసలు పాక్‌తో ఏ ఐసీసీ టోర్నమెంట్లోనూ భారత్ ఆడకూడదని డిమాండ్లు వినపడుతున్నాయి.
భారత్ – పాకిస్థాన్‌లో క్రికెట్ ప్రధాన క్రీడగా ఉంది. ఈ రెండు దేశాలు క్రికెట్లోనే బాగా రాణిస్తున్నాయి. భారత్ టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్ వంటి ఇతర ఆటల్లో కాస్త రాణిస్తుంటుంది. పాక్ క్రికెట్ తప్ప మరో క్రీడలో రాణించడం లేదు. ఇప్పుడు పాక్‌లో క్రికెట్ పరిస్థితి కూడా దిగజారిపోతోంది. ఇటీవలి ఐసీసీ టోర్నమెంట్లలో పాక్ ఏ మత్రం రాణించలేదు.