IND vs ENG: ఇంగ్లాండ్‌తో చివరి టీ20 మ్యాచ్.. వాళ్లిద్దరిపైనే అందరి దృష్టి.. వాళ్లకు విశ్రాంతి తప్పదా..
ఇంగ్లాండ్ పై మూడు మ్యాచ్ లలో విజయం సాధించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగంలో తడబాడు స్పష్టంగా కనిపిస్తోంది.

Team india
IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు పూర్తికాగా.. 3-1 తేడాతో భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. చివరి టీ20 మ్యాచ్ ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. వాఖండేలోనూ విజయంతో సిరీస్ ను ముగించాలని భారత్ చూస్తుండగా.. చివరి మ్యాచ్ లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తుంది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా మేనేజ్మెంట్ పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సుదీర్ఘకాలం తరువాత మూడో టీ20 మ్యాచ్ లో ఆడాడు.. అయితే, నాల్గో టీ20 మ్యాచ్ లో షమీని టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. ఇవాళ జరిగే చివరి మ్యాచ్ లో మహ్మద్ షమీ ఆడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Wriddhiman Saha Retire : క్రికెట్ కు వృద్ధిమాన్ సాహా గుడ్ బై..
ఇంగ్లాండ్ పై మూడు మ్యాచ్ లలో విజయం సాధించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగంలో తడబాడు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది మ్యాచ్ ల కిందట బంగ్లాదేశ్ పై 75 పరుగులు చేశాక.. అతడు మరో కీలకమైన ఇన్నింగ్స్ ఆడలేదు. మరోవైపు ఇంగ్లాండ్ తో సిరీస్ లో రెండుసార్లు డకౌట్ రూపంలో సూర్య పెవిలియన్ బాటపట్టాడు. నాలుగు మ్యాచ్ లలో కేవలం సూర్య చేసిన పరుగులు 26 మాత్రమే. మరోవైపు ఓపెనర్ సంజూ శాంసన్ సైతం పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నాడు. గడిచిన నాలుగు మ్యాచ్ లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇవాళ్టి మ్యాచ్ లో వారిద్దరు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: IND vs ENG : మ్యాచ్ ఓడిపోయినా.. చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ బౌలర్.. భారత్ పై ఒకే ఒక్కడు
ఈనెల 6వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ లకు ఇవాళ్టి టీ20 మ్యాచ్ లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. వీరిద్దరూ రాబోయే వన్డే, ఛాంపియన్స్ ట్రోపీ జట్టులోనూ ఎంపికయ్యారు. వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లలో 12 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ప్లేయింగ్ ఎలెవెన్ లో స్థానం ఖాయంగా కనిపిస్తుంది. నాలుగో మ్యాచ్ లో హర్షిత్ రాణా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఎవరికి తుది జట్టులో చోటు లభిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
వాంఖడే స్టేడియంలో పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈసారీ పరుగుల వరద ఖాయంగా చెప్పొచ్చు. ఆరంభంలో పేసర్లకు, తరువాత స్పిన్నర్లకు పిచ్ అనుకూలించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ తీసుకునేందుకు ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం ఉంది.
ఐదవ మ్యాచ్‌కి టీమిండియా జట్టు (అంచనా) : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.