వరుణుడి ఎఫెక్ట్ : ముగిసిన తొలి రోజు ఆట.. రోహిత్ సెంచరీ

  • Published By: sreehari ,Published On : October 2, 2019 / 10:49 AM IST
వరుణుడి ఎఫెక్ట్ : ముగిసిన తొలి రోజు ఆట.. రోహిత్ సెంచరీ

Updated On : October 2, 2019 / 10:49 AM IST

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ సెంచరీతో అదరగొట్టాడు. 174 బంతుల్లో  బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగి 115 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (183 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ ; 84 హాఫ్ సెంచరీ) జోడీతో దూకుడుగా ఆడుతూ రోహిత్ భారత్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

వీరిద్దరూ కలిసి విజృంభించడంతో తొలి రోజు ఆటలో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. టీ బ్రేక్ సమయానికి కూడా ఒక్కో వికెట్ కూడా పడిపోకుండా రోహిత్, మయాంక్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. లంచ్ సమయానికి ముందు రోహిత్ హాప్ సెంచరీ పూర్తి చేశాడు.

లంచ్ బ్రేక్ తర్వాత గేర్ మార్చిన రోహిత్.. స్పిన్నర్ల బంతులను చీల్చి చెండాడాడు. స్పిన్నర్ డాని పెయిడిట్ వేసిన బంతుల్లో సిక్స్ లు బాదేసి తన నాల్గో టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. తొలి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలిచినప్పటికీ రోహిత్ తన పట్టు వీడలేదు. దక్షిణాఫ్రికా బౌలర్ల బంతులను బౌండరీలు దాటిస్తూ పరుగుల దాహం తీర్చుకున్నాడు.

59.1 ఓవర్లలో వికెట్లు ఏమి కోల్పోకుండానే టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండు సెషన్లకే తొలి రోజు ఆటకు బ్రేక్ పడింది. వర్ష ప్రభావంతో మైదానంలో వెలుతురు తక్కువగా ఉండటంతో టీ బ్రేక్ పడిన కాసేపటికే అంపైర్లు తొలి రోజు ఆటను ముందుగానే నిలిపివేశారు. అనంతరం మైదానాన్ని కవర్లతో కప్పి వేశారు. తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 59.1 ఓవర్లలో 202/0 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగారు.