ధోనీ సంగతి తేల్చేస్తానంటోన్న గంగూలీ

టీమిండియాలో అనుభవశాలి. సాటిలేని వికెట్ కీపర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూనే ప్రస్తుత భారత క్రికెట్ తిరుగుతోంది. ఈ క్రమంలో అతని రిటైర్మెంట్‌పై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే బీసీసీఐ ప్రెసిడెంట్‌గా నామినేషన్ వేసిన గంగూలీ దీనిపై స్పందించాడు.
‘ఎన్నాళ్లని ఈ సందిగ్ధం. అక్టోబరు 24న సెలక్టర్లతో మీటింగ్ ఉంది. ఆ రోజు నా అభిప్రాయాన్ని వాళ్ల ముందు ఉంచుతాను. అప్పుడే తెలుస్తుంది ధోనీకి ఏం కావాలో. అదే పనిలో ఉన్నాం. ధోనీ చెప్పినదాన్ని బట్టి మున్ముందు ఏం చేయాలో ఆలోచిస్తాం’ అని గంగూలీ మీడియా ముందు చెప్పుకొచ్చాడు.
ఇటీవల టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడి ధోనీ లాంటి సీనియర్ ప్లేయర్ కు ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసని అన్నాడు. జట్టు కోసం సంచలన నిర్ణయాలకు వెనుకాడని గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయితే పెను మార్పులు ఖాయంగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధోనీ పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.. అక్టోబరు 24వరకూ వేచి చూడాల్సిందే.