మే22న ఇంగ్లాండ్ బయల్దేరనున్న టీమిండియా

వరల్డ్ కప్ నిమిత్తం విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. మే 30నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత్ జూన్ 5న తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కంటే ముందు భారత్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని భారత్ మే22న ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఈ మేర కొన్ని నెలల పాటు తర్జనభర్జనలు పడి వరల్డ్ కప్ స్క్వాడ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఆ 15మంది ప్లేయర్లలో కొందరు ఐపీఎల్‌లో ఆడి గాయాలపాలవుతారని భావించినట్లే జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేదర్ జాదవ్ గాయానికి గురైయ్యాడు. మే24నుంచి జరగనున్న వార్మప్ మ్యాచ్‌లకు ఆడాలంటే కేదర్ జాదవ్ అంతకుముందే ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి.
టీమిండియా కూర్పు ఇలా ఉంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలతో పాటు థర్డ్ పొజిషన్‌లో విరాట్ కోహ్లీ టాపార్డర్ బ్యాట్స్‌మెన్. ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ మిడిల్ ఆర్డర్‌ను ఆదుకోగల నైపుణ్యం కలవారు. ఇక బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి ఫేసర్లుగా జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఉంటే స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా బలం చేకూర్చనున్నారు.
నెం.4స్థానంలో అంబటి రాయుడిని తీసుకుంటారని భావిస్తే విజయ్ శంకర్‌కు స్థానం కల్పించగా రాయుడు స్టాండ్ బై ప్లేయర్‌గా సెలక్ట్ అయ్యాడు. అతనితో పాటు పంత్ కూడా అదే జాబితాలో ఇంగ్లాండ్‌కు పయనమవనున్నాడు.