Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్..
ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తరువాత భారత్ జట్టు ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో ఆడనుంది.

Kuldeep Yadav
ICC Champions Trophy 2025: ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడిన తరువాత భారత్ జట్టు ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో ఆడనుంది. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19నుంచి ఛాంపియన్స్ ట్రోపీ ప్రారంభం కానుంది. అయితే, భారత్ ఆడే మ్యాచ్ లన్నీ యూఏఈ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోపీకి వెళ్లే 15మంది ఆటగాళ్లతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. అయితే, అతని ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం అతను ఫిట్నెస్ పరీక్షలో నెగ్గాడు.
గతేడాది అక్టోబర్ నెలలో కుల్దీప్ యాదవ్ సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి జట్టుకు దూరమయ్యాడు. జనవరి 26న నేషనల్ క్రికెట్ అకాడమీలో కుల్దీప్ యాదవ్ కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో కుల్దీప్ నెగ్గాడు. ఈ సందర్భంగా అతను ఎక్స్ వేదికగా.. తాను ఫిట్నెస్ సాధించేందుకు కృషిచేసిన ఎన్సీఏలోని బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కుల్దీప్ రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టు తరపున ఆడుతున్నాడు. గురువారం నుంచి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో యూపీ తరపున కుల్దీప్ బరిలోకి దిగనున్నాడు. కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ సాధించడం భారత్ జట్టుకు శుభవార్త అనే చెప్పొచ్చు.
Also Read: ICC CEO : పాకిస్తాన్ ఎఫెక్ట్.. ఐసీసీ సీఈవో రాజీనామా
ఫిబ్రవరి 6నుంచి ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. దీంతో అతడు వన్డే మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ లో చేరే అవకాశం ఉంది. తద్వారా భారత్ స్పిన్ బౌలింగ్ ఎటాక్ మరింత బలపడుతుందని చెప్పొచ్చు. కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ తో ఉన్నప్పటికీ.. రంజీలోనూ, ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో రాణిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో అవకాశం దక్కే పరిస్థితి ఉంటుంది.
Recovery takes a team. Grateful to the NCA and it’s team for all the work behind the scenes! 💪🏻🙏🏻 pic.twitter.com/dHhwngvpaG
— Kuldeep yadav (@imkuldeep18) January 27, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తో, మార్చి2న న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోపీలో టీమిండియా చివరిసారిగా 2013లో ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచింది.