అలా ముగిసింది: మారిన్ తప్పుకుంది.. సైనా గెలిచింది

అలా ముగిసింది: మారిన్ తప్పుకుంది.. సైనా గెలిచింది

Updated On : January 27, 2019 / 10:14 AM IST

ప్రపంచ తొమ్మిదో ర్యాంకు షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో మొదలైన గేమ్ కరోలినా మారిన్ గాయంతో ముగిసింది. ఇలా తొలి గేమ్ మధ్యలోనే మ్యాచ్ సైనా చేతికొచ్చేసింది. ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ కరోలినా మారిన్ గేమ్‌ను దూకుడుగా ఆరంభించింది. మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే సైనాని ఒత్తిడిలోకి నెట్టిన మారిన్ తొలి సెట్‌లో 7-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

 

కానీ.. ఈ దశలో గాల్లోకి ఎగిరిన మారిన్ అదుపుతప్పి శరీరం బరువునంతా కుడికాలిపై మోపడంతో మోకాలు బెణికింది. దీంతో.. కనీసం నిలబడలేకపోయిన ఈ స్పెయిన్ షట్లర్.. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత మళ్లీ మ్యాచ్‌ని కొనసాగించేందుకు ప్రయత్నించింది. కానీ.. నొప్పి తీవ్రం కావడంతో.. మ్యాచ్‌ నుంచి వెదొలిగింది. 

 

మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే మోకాలి గాయం కారణంగా కుప్పకూలిపోయిన మారిన్ కనీసం నిల్చోలేకపోవడంతో టోర్నీ నిర్వాహకులు సైనా నెహ్వాల్‌ని విజేతగా ప్రకటించారు. ఈ ఏడాది సైనాకి ఇదే తొలి టైటిల్. సైనా సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకూ మారిన్‌తో 11 మ్యాచ్‌ల్లో తలపడి ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.