INDvAUS, 4వ వన్డే: పంత్‌కు చాన్స్.. ఓపెనర్లు మారాల్సిందేనా..

INDvAUS, 4వ వన్డే: పంత్‌కు చాన్స్.. ఓపెనర్లు మారాల్సిందేనా..

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను ప్రపంచ కప్ లో ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకే పంత్ వరల్డ్ కప్ జరిగే లండన్‌కు వెళ్లేందుకు టిక్కెట్ వచ్చేసిందట. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరగనున్న 4వ వన్డేను భారత్-ఆస్ట్రేలియాలు పంజాబ్ లోని మొహాలీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆడనున్నాయి. మూడు వన్డేలలోనూ బెంచ్ కే పరిమితమైన పంత్ ను ఈ వన్డేలో ఆడిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

పైగా పంత్.. వరల్డ్ కప్ జట్టులో ఉండేందుకు ఇప్పటికే టిక్కెట్ రావడంతో మిగిలిన ఈ 2వన్డేలలో ఆడిస్తారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వికెట్ కీపర్‌గా ధోనీకి ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకుంటున్న క్రమంలో మరో బ్యాట్స్‌మన్‌గా పంత్‍‌కు అవకాశమివ్వాలనుకుంటున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ప్రాక్టీసు కోసం వెళ్లిపోతాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంచితే.. జరిగిన 3వన్డేల్లోనూ టీమిండియా ఓపెనర్లు నిరాశపరుస్తూనే ఉన్నారు. తొలి వన్డేలో ధావన్.. పేలవ ప్రదర్శన చూపిస్తే.. రెండో వన్డేలో రోహిత్ శర్మ.. మూడో వన్డేలో ఇద్దరూ ఆశించినంత స్థాయిలో రాణించకపోవడం టీమిండియా ఓటమికి కారణమైంది. 

ఆల్ రౌండర్లకు ప్రత్యామ్నాయం దొరకకపోవడంతో కేదర్ జాదవ్, విజయ్ శంకర్‌లను అదే స్థానాల్లో కొనసాగిస్తే బాగుంటుంది. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న వన్డే ఫార్మాట్ కావడంతో తొలి వన్డే నుంచి జట్టులో ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న భారత్‌కు.. నాలుగో వన్డేలో కొద్ది పాటి మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. 

బౌలర్లలోనూ మార్పులు తప్పదనిపిస్తుంది. మొహమ్మద్ షమీకి బదులుగా భువనేశ్వర్ కుమార్‌కు చోటు కల్పించనున్నారు.  వరల్డ్ కప్‌కు ముందు షమీకి విశ్రాంతినిస్తే.. బాగుంటుందని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. మిగిలిన బౌలర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, బుమ్రాలు యథా స్థానంలో కొనసాగుతారు. 
 

సమయం: 
2019 మార్చి 10న మధ్యాహ్నం 1.30 గంటలకు 

వేదిక: 
పంజాబ్‌లోని మొహాలీ స్టేడియం

ప్రత్యక్ష ప్రసారం:
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, హాట్ స్టార్

ఇరు జట్లు(అంచనా): 

భారత్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అంబటి రాయుడు, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేదర్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా/యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోనిస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), ఆడం జంపా, పాట్ కమిన్స్, జై రిచర్డ్‌సన్, నాథన్ లయన్/జాసన్ బహ్రెన్‌డార్ఫ్